Revanth Reddy | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన పేరిట సాగుతున్న కాంగ్రెస్ పాలనలో పౌర హక్కుల హననం జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షంపై, ప్రశ్నించేవారిపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. మీడియాపై దాడులు, జర్నలిస్టుల అక్రమ అరెస్టులను వారు ఉదహరిస్తున్నారు. మీడియాపై రేవంత్ సర్కారు ఉక్కుపాదం మోపిన ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోయే వ్యాఖ్యలను మూడున్నరేండ్ల కిందటే ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి చేశారు. ప్రస్తుత తన ప్రభుత్వాన్ని తానే తిట్టుకున్నట్టు ఉన్నాయి ఆ వ్యాఖ్యలు.
‘ఏం జరుగుతున్నది ఈ తెలంగాణ సమాజంలో? ఏంది ఈ నిర్బంధాలు? ఈ ఒత్తిళ్లు ఏంది? ఈ నిర్బంధమేంది? ఈ రకమైన పరిస్థితులు మేం ఎప్పుడూ చూడలేదు. 20 ఏండ్ల నుంచి నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నా.. ఈ పక్కన 40 ఏండ్ల నుంచి ఉన్నోళ్లు ఉన్నరు. విద్యార్థి దశ నుంచి ఇక్కడ పొన్నం ప్రభాకర్లాంటి వారు ఉన్నరు. మేం ఎప్పుడూ చూడలే. జర్నలిస్టులుగా మీరు ఆలోచన చేయండి. అంత నక్సలైట్లు ఉద్ధృతంగా ఉన్న సమయంలో కూడా ప్రజలు భయంభయంగా బతకలేదు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం.. ప్రజలు ఇష్టపడి ఓట్లేసిన ప్రభుత్వం.. ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది.
మనం ఎన్నుకొన్న ప్రభుత్వానికి మనమే భయపడే పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే, ఇయ్యాల జర్నలిస్టులు కూడా.. ఏదైనా మాట్లాడాలంటే అటూఇటూ చూసుకొనే పరిస్థితి వచ్చింది. మీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి.. మీరు స్వేచ్ఛగా గతంలో జర్నలిస్టులుగా మీ అభిప్రాయాలు గాని, ప్రశ్నలు గాని, మీరు సమస్యల మీద పత్రికలనో, టీవీల్లోనో విశ్లేషణ చేసినట్టుగా ఈరోజు ఉందా? జర్నలిస్టులుగా మిమ్మల్నే ఒత్తిడి చేసి, మీ వృత్తిని మిమ్మల్ని నిర్వహించకుండా తెచ్చుకొన్న తెలంగాణ రాష్ట్రంలో ఇంత దుర్మార్గంగా, ఇంత భయపెట్టి పరిపాలన చేయాలనుకోవడం తెలంగాణ సమాజానికి మంచిదా? తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములు కాదా? మీరు ఆరోజు తెలంగాణ ఉద్యమాన్ని నడపలేదా? మీరు నడిపి, మీరు ముందుకు తీసుకొచ్చి, మీరు కొట్లాడి, మీరు పోరాటం చేసి తెచ్చుకొన్న తెలంగాణలో జర్నలిస్టులుగా మీరు కూడా భయంభయంగా బతికే పరిస్థితి వస్తే ఇది పరాయి పాలన కాదా? తెచ్చుకొన్న తెలంగాణలో పరాయి పాలనలో భయపడుకుంటూ బతికే పరిస్థితులు మనకు అవసరమున్నయా? ఈ తెలంగాణ రాష్ట్రంలో..’
– 24.10.2021లో కరీంనగర్లో ఓ కార్యక్రమంలో రేవంత్రెడ్డి
అక్రమ నిర్బంధాలు జర్నలిస్టులకు కొత్త కాదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇలాంటివి చాలా చూశాం. జర్నలిజాన్ని పూర్తిగా తమ దొడ్లో కట్టేసుకోవాలనో.. లేకుంటే పాత్రికేయులందరినీ కూడా తమ బానిసలుగానో, లేకుంటే ఉపాధిహామీ కూలీలుగానో చూడాలనుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో.. దానిపై కచ్చితంగా మీడియా మిత్రులు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. మీరు మౌనంగా ఉంటే ఇయ్యాల రవిప్రకాశ్గారికి జరిగింది రేపు మీకూ జరగొచ్చు.
– రేవంత్రెడ్డి (08.10.2019)