హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు తక్కువగా ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాము అన్ని స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం సచివాలయం లో డీఎస్సీ-2024 ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే డీఎస్సీని నిర్వహించడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పుడున్న గురుకులాలను ఒకే ప్రాంగణంలోకి చేర్చి ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్’ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
నియోజకవర్గంలోనే 20-25 ఎకరాల్లో రూ. 100-125 కోట్లను వెచ్చించి భవనాలను నిర్మించి వసతులు కల్పిస్తామని వెల్లడించారు. డీఎస్సీ పరీక్షలు ముగిసిన 55 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామని, 1: 3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు. అక్టోబర్ 9న ఎల్బీస్టేడియంలో ని యామక పత్రాలను అందజేస్తామని పే ర్కొన్నారు. ఫీజుల నియంత్రణకు కమిటీ వేస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.