Harish Rao | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన విజయోత్సవాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో రైతులను విజయవంతంగా దగా చేసినందుకు రైతు పండుగ అంటూ మూడు రోజుల విజయోత్సవాలు చేస్తున్నావా అని ప్రశ్నించారు. గొప్పగా చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్‌లోని 9 హామీల్లో ఒక్కటీ అమలు చేయనందుకు పండుగ చేస్తున్నావా అని మండిపడ్డారు. రుణమాఫీ ఎగ్గొట్టి, రైతు భరోసా బోగస్ చేసి, కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయకుండా రైతులను ఏడ్పిస్తున్నందుకు చేస్తున్నావా అని నిలదీశారు. మీ ఏడాది దుర్మార్గ పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగ చేస్తున్నావా అని మండిపడ్డారు.
చెప్పింది కొండంత, చేసింది గోరంత అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టాడని.. అధికారంలోకి వచ్చాక నిండా ముంచాడని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు పథకానికి ఎగనామం పెట్టారని అన్నారు. నూటొక్క దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని మోసం చేశారని అన్నారు. సగం మందికి మొండి చెయ్యి చూపారని విమర్శించారు. 24 గంటల నాణ్యమైన కరెంటు అందించలేక చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధర లేదని.. అన్ని పంటలకు బోనస్ అసలే లేదని.. పత్తి అయినా, ధాన్యం అయినా కొనుగోలు కేంద్రాలు లేవని అన్నారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తానన్న భరోసా దిక్కులేదని విమర్శించారు.
ఈ ఏడాది పాటు రైతులకు మీరు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతు పండుగ నిర్వహించడం సిగ్గుచేటు అని హరీశ్‌రావు విమర్శించారు. పైగా, ఏడాది పాలనలో రైతు సంక్షేమం కోసం 54,280 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం చేసుకోవడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. రైతు బీమా, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోళ్ల కోసం మీరు ఖర్చు చేసినా అని చెప్పిన రూ. 27,486 కోట్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిందని తెలిపారు. ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సి ఉంటుందే అని చెప్పారు. కానీ, కొత్తగా తామేదో రైతులకు చేసినట్లు డబ్బా కొట్టుకోవడం రైతులను మరోసారి మోసం చేయడమే అని అన్నారు. ఇదేనా కాంగ్రెస్ మార్కు మార్పు అని ప్రశ్నించారు.
మీ మేనిఫెస్టో ప్రకారం రైతులకు పడిన బాకీ రుణమాఫీ కింద దాదాపు 14,000 కోట్లు.. ఖరీఫ్ రైతు బంధు కింద 7,500 కోట్లు.. కౌలు రైతులకు మరో 3,000 కోట్లు.. రైతు కూలీలకు 1600 కోట్లు.. అన్ని పంటలకు బోనస్ సుమారు 3,000 కోట్లు అకాల వర్షాలకు గానూ పంట నష్టం సుమారు 11,700 కోట్లు (కేంద్రానికి రాష్ట్రం పంపిన రిపోర్టు).. ఇలా ఈ ఏడాది కాలంలో మొత్తం రూ. 40,800 కోట్లు రైతులకు బాకీ పడ్డారని హరీశ్‌రావు తెలిపారు. మీకు, మీ పార్టీకి రైతుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. రైతులకు బాకీ పడ్డ రూ. 40,800 కోట్లతో పాటు, ఈ రబీకి ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా వెంటనే విడుదల చేసి పండుగ చేసుకోవాలని డిమాండ్ చేశారు.