హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసుకు పదేండ్లు నిండాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సరిగ్గా పదేండ్ల క్రితం శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ నామినేట్ చేసిన వేం నరేందర్‌రెడ్డికి మద్దతు తెలపాలంటూ 2015 మే 31న నాటి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు లంచం ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ రోజు రేవంత్‌రెడ్డితోపాటు మరికొందరిని ఏసీబీ అరెస్టు చేసింది. నాటి నుంచి ఈ కేసు ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్నది.
కాలక్రమంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి సీఎం అయ్యారు. కానీ, ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జిషీట్లో టిడీపీ అధినేత చంద్రబాబు పేరును ప్రస్తావించినప్పటికీ ఏసీబీ చార్జిషీట్లో చంద్రబాబు పేరు లేకపోవడంతో ఆయనపై చర్యలు చేపట్టలేదు. రాజకీయంగా దుమారం రేపిన ఈ కేసు విచారణ చాలా నెమ్మదిగా కొనసాగుతున్నది. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఒక్కసారి కూడా ఈ కేసు విచారణకు హాజరు కాలేదు.