CM Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యంకాని హామీలెన్నో ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అబద్ధపు ప్రచారానికి తెరలేపారు. ఆ రాష్ట్ర ప్రజలనూ మోసగించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలుపై చేతులెత్తేసిన ఆయన.. మహారాష్ట్రలో మాత్రం ఆరు గ్యారెంటీలపై గప్పాలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను కేవలం 10 నెలల్లోనే నెరవేర్చినట్టు అబద్ధాలను అలవోకగా వల్లెవేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో శనివారం ప్రచారానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ముంబైలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేసినట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పథకాల్లో పెట్టిన కోతల గురించి చెప్పకుండా.. మాటల ‘కోతలు’ కోయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే.. నెరవేర్చినట్టు అబద్ధాలు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ముంబైలో చెప్పిన అబద్ధాలు, అసలు వాస్తవాలు ఏమిటో తెలుసుకుందాం.
రేవంత్ అబద్ధం: తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశాం.వాస్తవం: అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 వరకే ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, 8 నెలల తర్వాతే రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు రూ.2 లక్షల రుణం కలిగిన రైతుల్లో పూర్తిగా రుణమాఫీ చేయలేదు. ఇప్పటివరకు 22 లక్షల మందికి రూ.17 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేశామని, ఇంకా 18 లక్షల మంది రైతులకు రూ.13 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉన్నదని మంత్రులే స్వయంగా ఒప్పుకొన్నారు. అలాంటప్పుడు రుణమాఫీ మొత్తం పూర్తి చేసినట్టు ఎలా అవుతుంది. వాస్తవాలు ఈ విధంగా కళ్ల ముందుంటే మహారాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పేశారు.రేవంత్ అబద్ధం: ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం.
వాస్తవం: బీఆర్ఎస్ ప్రభుత్వమే పోలీస్, గురుకుల, నర్సింగ్ ఇలా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలను పూర్తిచేసింది. ఎన్నికలు రావడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ అభ్యర్థులకు నియామకపత్రాలు మాత్రమే అందించి ఆ ఉద్యోగాలను తాము ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నది. ఒక్క డీఎస్సీలో 5 వేల ఉద్యోగాలు తప్పా మిగతావన్నీ కూడా గత ప్రభుత్వం పూర్తిచేసిన నియామకాలే కావడం గమనార్హం.
రేవంత్ అబద్ధం : మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500 కే గ్యాస్ అందిస్తున్నాం. 50 లక్షల మందికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం.వాస్తవం: తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి రూ.500కే గ్యాస్, ఉచిత విద్యుత్తు అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టిన ప్రభుత్వం సగం మంది అర్హులను అనర్హులుగా ప్రకటించింది. రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌కార్డులు ఉండగా రూ.500కే గ్యాస్‌ను కేవలం 40 లక్షల కుటుంబాలకు ఇస్తున్నది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును
50 లక్షల కుటుంబాలకే అందిస్తున్నది. ఈ లెక్కన కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం సుమారు 50 లక్షల కుటుంబాలకు పథకాన్ని కోత పెట్టింది.
రేవంత్ అబద్ధం: వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నాం.
వాస్తవం: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకాగానే ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక కేవలం సన్నరకం ధాన్యానికే బోనస్ ఇస్తామని ప్రకటించింది. తద్వారా దొడ్డు రకం పండించే రైతులకు కాంగ్రెస్ సర్కారు ధోకా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సీజన్ల ధాన్యం కొనుగోలు చేసింది. కానీ ఆ రెండు సీజన్లకు బోనస్ ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఇప్పుడు ఈ వానకాలం సీజన్ నుంచి ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు సగం పూర్తి కాగా ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా బోనస్ పైసలు ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు.
మోదీ అదానీకి దోచిపెడుతుండు: రేవంత్
‘ప్రధాని మోదీ దేశ సంపదను అదానీకి దోచి పెడుతున్నారని రాహుల్‌గాంధీ ఆరోపిస్తున్నారు. మీరేమో రాహుల్‌గాంధీ మాటలకు విరుద్ధంగా అదానీతో మీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటున్నది. దీన్ని మీరే విధంగా సమర్థించుకుంటారు’ అని సీఎం రేవంత్‌రెడ్డిని విలేకరులు సూటిగా ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. మోదీ అదానీకి దోచి పెడుతుంటే, తానేమో అదానీ జేబులోంచి పైసలు తీసుకుంటున్నా.. అని సమాధానం ఇచ్చారు. అంతకు ముందు అదే ప్రెస్మీట్లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ రైతులకు ఎలాంటి మేలు చేయకుండా వాళ్లను దోచుకుంటూ అదానీకి దోచి పెడుతున్నారని ఆరోపించడం కొసమెరుపు. ఈ విధంగా ఓ వైపు దేశ సంపదను అదానీకి దోచి పెడుతున్నారని విమర్శిస్తూనే ఆయనతో కావాలనే ఒప్పందాలు చేసుకుంటున్నామని చెప్పడం గమనార్హం.