పరిగి, డిసెంబర్ 19 : ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు చేయడం పట్ల బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కారు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో గురువారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదని విమర్శించారు. కుట్రలు, కేసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడడం అవివేకమని పేర్కొన్నా రు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం వల్లే కేటీఆర్‌పై ఫార్ములా ఈ- కారు రేస్ కేసు నమోదు చేసినట్టు ఆరోపించారు. వెంటనే కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ ఎంపీపీ కరణం అరవిందరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.