హైదరాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సాఆర్ చేసిన అభివృద్ధి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నదని, సంక్షేమంలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నారు. సాయంత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ (ఏపీసీసీ) ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమంలోనూ రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో సంక్షేమం పేరు చెబితే మొదట గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలకు నాడు ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలే స్ఫూర్తి అని తెలిపారు.
రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే వైఎస్సాఆర్ లక్ష్యమని, ఆ కలలను పార్టీ కార్యకర్తలు నిజం చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కూడా నాడు వైఎస్ పాదయాత్రనే స్ఫూర్తి అని తెలిపారు. నాడు పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు వైఎస్ ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చేవారో ఇప్పుడు కూడా అదే విధమైన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఎలాంటి పైరవీలు చేయని వారికి, పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి, త్యాగం చేసిన వారికి పదవులు ఇస్తున్నట్టు తెలిపారు. గతంలో పార్టీని వీడిన వైఎస్సాఆర్ అభిమానులంతా పార్టీలోకి తిరిగి రావాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వైఎస్సాఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తామని తెలిపారు. నాడు వైఎస్సాఆర్ తక్కువ సమయంలోనే గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు అందించి ప్రజల గుండెల్లో చివరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రాబోయే రెండు దశాబ్దాలు తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమని పేర్కొన్నారు. వైఎస్సార్ అభిమానులంతా కాంగ్రెస్‌లో చేరాలని పిలుపునిచ్చారు.
2029లో ఏపీ సీఎంగా షర్మిల
2029లో దేశ ప్రధానిగా రాహుల్‌గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ షర్మిల ఎన్నికవుతారని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. కడప ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వస్తే వైఎస్ షర్మిలను గెలిపించే బాధ్యత తీసుకుంటామని, కడపలో ప్రచారం చేస్తానని వెల్లడించారు. ఏపీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్‌కల్యాణ్ అని కొత్త అర్థం చెప్పారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనమండలిలో తాను మాట్లాడినప్పుడు ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల పట్ల ఎంతో ఉదారంగా ఉండేవారని చెప్పారు.