Revanth Reddy | హైదరాబాద్,మే 29 (నమస్తేతెలంగాణ): కొంతమంది ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, సొంత డబ్బా కొట్టుకుంటున్నారని.. ఇక మీదట అలా కుదరదని సీఎం ఏ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేలందరూ సోషల్ మీడియాను విస్తృతంగా వాడుతూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందేనని స్పష్టంచేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన పీసీసీ రాజకీయ వ్యవహారాల, అడ్వైజరీ కమిటీల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, వివేక్, అజారుద్దీన్, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదిరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ వల్ల లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులు, మహిళలు, దళితుల ఓట్లు కోల్పోయే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ఆ వర్గాల ఓట్లు కోల్పోకుండా సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా చొరవ తీసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం కోసం 119 నియోజకవర్గాలు,17 లోక్‌సభ నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జులను నియమించాలని సూచించారు. అసెంబ్లీ ఇన్చార్జులు తప్పనిసరిగా నియోజకవర్గాల్లోనే ఉండాలని స్పష్టంచేశారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలో బాధ్యతలు అప్పగించాలని సూచించారు. హైదరాబాద్ నగర పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్పైన అసెంబ్లీ వారీగా సమావేశాలు పెట్టాలని, మహిళా కాంగ్రెస్ తరఫున క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సర్ పేరుతో సెక్యులర్ ఓటు బ్యాంకును తొలగించే కుట్ర జరుగుతున్నదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు.