హైదరాబాద్: ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): యువత డ్రగ్స్‌కు కాకుండా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్‌గా పిలిచేవారని, అత్యుత్తమ క్రీడాకారులను అందించిన ఘనత నగరానిదని కొనియాడారు. స్పై మాస్టర్ బీఎన్ మల్లిక్ పోషించిన కీలక పాత్రను సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో రూపుదిద్దుకొంటున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ బోర్డులో ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. పబ్ కల్చర్, డ్రగ్స్ బారిన పడుతున్న యువతను తిరిగి మైదానాల్లోకి రప్పించడమే తన ప్రధాన ఉద్దేశమని పేరొన్నారు. యువత సరైన దిశలో వెళ్లకపోతే భవిష్యత్తులో దేశానికి తీరని నష్టం జరుగుతుందని తెలిపారు. ఫైనల్ మ్యాచ్ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు మ్యాచ్ ఆడారు. విజేతలకు ముఖ్యమంత్రి ట్రోఫీలను అందజేశారు.
సీఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ జట్లకు గోల్డ్‌మెడల్స్
దేశవ్యాప్తంగా 34 పురుషుల జట్లు, 9 మహిళల జట్లు ఈ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నాయి. సీఐఎస్ఎఫ్ జట్టు ఫైనల్లో ఘన విజయం సాధించి బంగారు పతకం సాధించగా, గోవా పోలీస్ జట్టు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకొన్నది. కేరళ జట్టు మూడో స్థానంలో నిలిచింది. మహిళా విభాగంలో అస్సాం రైఫిల్స్ ప్రథమ స్థానం, ఒడిస్సా జట్టు ద్వితీయ, సీఐఎస్ఎఫ్ జట్టు తృతీయ స్థానాలను గెలుపొందాయి. కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, డీజీపీ బీ శివధర్‌రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేశ్, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, వివిధ విభాగాల పోలీస్ ఉన్నతాధికారులు సప్నా తివారి, శిఖా గోయెల్, అభిలాషా బిస్త్, విజయ్‌కుమార్, అనిల్‌కుమార్, సంజయ్‌కుమార్, గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.