హైదరాబాద్, జూలై24 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మిస్తామని, తండాల నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు రాంచందర్‌నాయక్, బీర్ల అయిలయ్య, చిక్కుడు వంశీకృష్ణ పంచాతీయలుగా చేసిన తండాలెన్ని? ఎన్నింటిని రెవెన్యూ పంచాయతీలుగా చేశారు? తండాల అభివృద్ధికి తీసుకున్న చర్యలేంటి? అని ప్రశ్నించారు. సీఎం జోక్యం చేసుకుని తండాలు, గూడేలు అభివృద్ధి చెందితేనే నిజమైన అభివృద్ధి అని, తండాలు, ఆదివాసీ గూడేల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. జీపీలకు భవనాల నిర్మాణంతో పాటు ప్రతి తండా నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు వేస్తామని వెల్లడించారు.
200 యూనిట్లలోపు అందరికీ జీరో బిల్లు ;డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు అందరికీ జీరో బిల్లులు అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, డాక్టర్ వెంకట్ నర్సింగ్‌రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వారందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నట్టు తెలిపారు. అర్హత కలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకుంటే గ్రామీణ ప్రాంతాల వారు మండల కార్యాలయాలు, పట్టణ ప్రాంతాలవారు డివిజన్ కార్యాలయాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 200 యూనిట్లు దాటితే బిల్లు చెల్లించాల్సిందేనని వెల్లడించారు. ఈ స్కీం కోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,418 కోట్లు బడ్జెట్లో కేటాయించామని వివరించారు.
‘తుమ్మిడిహట్టి’కి కట్టుబడి ఉన్నాం: ఉత్తమ్
తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, నవీన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. సాంకేతిక నిపుణులతో మాట్లాడిన తర్వాత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సుందిళ్ల, మేడిగడ్డ బరాజ్‌లపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గంధమల్ల రిజర్వాయర్ అంశం సుధీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నదని ఎమ్మెల్సీ నవీన్ ప్రస్తావించగా భూసేకరణపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. గ్రామస్థులు భూసేకరణకు సహకరిస్తే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు
అర్హులకు కొత్త కార్డు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి ఉత్తమ్ స్పష్టంచేశారు. బీఆర్ఎస్ సభ్యులు వాణీదేవి, బస్వరాజు సారయ్య, రఘోత్తమ్‌రెడ్డి, తాతా మధు, జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రేషన్‌కార్డు ల జారీ మార్గదర్శకాలకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.
గృహజ్యోతి అర్హులందరికీ ఇండ్లు : మంత్రి పొంగులేటి
బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 25 ద్వారా మంజూరు చేసిన 496 ఇండ్లకు గృహజ్యోతిలో రూ.3 లక్షలకు బదులు రూ.5 లక్షలు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుడు తాతా మధు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ ప్రభు త్వం జీవో 25 ద్వారా గృహ నిర్మాణానికి రూ.3 లక్షలు కేటాయించిందని, ఆ స్కీం కింద రూ.496 ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు. ఆ జీవోను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. పేదలకే ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని స్పష్టంచేశారు.
మౌలిక వసతులు కల్పిస్తున్నాం: మంత్రి సీతక్క
రూ.5 లక్షల కంటే తకువ వార్షికాదాయమున్న జీపీలకు అదనంగా రూ.5 లక్షలు విడుదల చేస్తూ, మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వివరించారు. రాష్ట్రంలో 6176 పంచాయతీలకు త్వరలో శాశ్వత భవనాలు నిర్మిస్తామని, మల్టీపర్పస్ వరర్లు, పారిశుధ్య కార్మికుల వేతనాల కోసం రూ.378.88 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. 1936 లో ల్యాండ్ సర్వే చేశారని, మళ్లీ ఇప్పటివరకు చేయలేదని, ఈ నేపథ్యంలోనే చాలా జీపీలు రెవె న్యూ పంచాయతీలుగా మారలేదని, త్వరలో రెవెన్యూ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ట్రాఫిక్రూల్స్పై అవగాహన: మంత్రి పొన్నం
స్కూల్, కాలేజీ బస్సుల ప్రమాదాలు, ఫిట్నెస్ తదితర అంశాలపై సభ్యులు మక్కాన్‌సింగ్ ఠాకూర్, ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి అడిగి ప్రశ్నలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో పాఠశాలలకు సంబంధించి 24 వేల బస్సులున్నాయని, పాఠశాలల ప్రారంభానికి నెల ముందు నుంచే ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తప్పనిసరి చేశామని, డ్రైవర్లు, అటెండర్లందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నామని, 15ఏళ్లు దాటిన వాహనాలను స్రాప్ కింద తీసుకుంటున్నామని వెల్లడించారు. పాఠశాల సమయానికి ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నామని, ట్రాఫిక్స్ రూల్స్‌పై ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అవగాహన కల్పించేందుకు విద్యాశాఖతో సమన్వయం చేసుకుంటున్నట్టు చెప్పారు.
నాకు మంత్రి పదవి సాధ్యమే: రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమేనని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రివర్గంలో ఉన్నా మంత్రి పదవి అడ్డుకాదని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరినప్పుడే మంత్రి పదవిపై హామీ ఇచ్చారని గుర్తుచేశారు. బుధవారం అసెంబ్లీ లాబీలో రాజగోపాల్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రతిభ, కమిట్మెంట్, ప్రామిస్తోనే మంత్రి పదవి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా పనిచేశానని, ఏదో ఒక సమయంలో ముఖ్యమంత్రిని కావొచ్చని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రజలందరూ తనను హోం మంత్రి కావాలని పదే పదే అడిగారని గుర్తుచేశారు.