నిజామాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరద పర్యటనలో బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం కొనసాగింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. బీఆర్ఎస్ నేతల నిర్బంధాల మధ్యనే సీఎం రేవంత్‌రెడ్డి కామారెడ్డి జిల్లాలో వరద పర్యటన కొనసాగింది. హెలికాప్టర్ ద్వారా గురువారం కామారెడ్డి జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు మార్గంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట, కుర్దూ గ్రామాల్లో ఇటీవల వరదలో కొట్టుకు పోయిన బ్రిడ్జిని, ఇసుక మేటలు వేసిన పంట పొలాలను పరిశీలించి రైతులతో ముచ్చటించారు.
అనంతరం కామారెడ్డి పట్టణంలోని జీఆర్, హౌసింగ్ బోర్డు కాలనీలను సందర్శించి వరద బాధితులతో మాట్లాడారు. వరదతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొడంగల్ తరహాలో ఇక్కడా అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. తెగిన రోడ్లు, చెరువులు మరమ్మతులు చేస్తామని, ఇండ్లు నష్టపోయిన వారికి హౌసింగ్ స్కీం ద్వారా ఫ్లడ్ డ్యామేజీలో అదనంగా ఇండ్ల కోటా కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
వరదలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో జరిగిన నష్టానికి శాశ్వత మరమ్మతుల కోసం అంచనాలను సిద్ధం చేయాలని అధికార యంత్రంగాన్ని ఆదేశించారు. తాత్కాలికంగా సమస్యలు పరిష్కరించడానికి కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్టుగా వివరించారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం స్థానికంగా ఎవరైనా దాతలు ముందుకొస్తే వారి సహకారం తీసుకోవాలని, ఫార్మా, బీడీ కంపెనీల యాజమాన్యాల సాయం తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. సీఎం వెంట రెవెన్యూ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు మదన్మోహన్ రావు, లక్ష్మీకాంతారావు, పీ సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు కాసుల బాలరాజు, తాహెర్‌బిన్ హుందాన్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పోలీసులు ఆంక్షలను విధించారు. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్‌ను హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే నిర్బంధించారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కీలక నేతలను ఠాణాలలో నిర్బంధించారు. మరోవైపు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం సొసైటీల వద్ద బారులు తీరి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ జోలికి మాత్రం పోలీసులు వెళ్లలేదు.
మోర్తాడ్, సెప్టెంబర్ 4: రాష్ట్రంలో అప్రకటిత నిర్బంధ పాలన కొనసాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారందరిని తక్షణమే విడుదల చేయాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని జాజుల సురేందర్ ఇంటి చుట్టు 20 మందికి పైగా పోలీసులను పెట్టి హౌస్ అరెస్ట్ చేశారని, ప్రజాపాలన అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. సోషల్‌మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టినా, ఇచ్చిన హామీల అమలు గురించి అడిగినా అరెస్ట్‌లు చేయడమేనా ప్రజాపాలన అంటే? అని నిలదీశారు. మీరెన్ని కేసులు పెట్టినా, నిర్బంధాలు విధించినా కాంగ్రెస్ ఇచ్చిన ఆరుగ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ను భూస్థాపితం చేయడం ఎవరి తరం కాదని స్పష్టంచేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరదల్లో నష్టపోయిన పంటకు ప్రతి ఎకరానికి రూ.25 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న చెరువు కట్టలు, రోడ్లు, బ్రిడ్జిలు, ఇతర పనుల మరమ్మతుల కోసం రూ.100కోట్లు ఇవ్వాలని కోరారు.