హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాలపై సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చాలామంది తిరిగి ఉద్యొగాల్లో చేరిన విషయాన్ని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ఇదే నియమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకు ఉండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.