హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాల కోసం రక్షణ శాఖకు చెందిన 2,450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మాడల్‌లో తెలంగాణకు 2.70 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న రేవంత్‌రెడ్డి సోమవారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిశారు. రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడుతూ.. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతా ల్లో రహదారుల విస్తరణ, ఫె్లైఓవర్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం రక్షణ శాఖ భూములు అవసరమని చెప్పారు.
రావిర్యాల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ రిసెర్చ్ సెంటర్ (ఆర్సీఐ) అవసరాల కో సం కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటు న్న విషయాన్ని గుర్తుచేస్తూ.. పరస్పర బదిలీ కింద రక్షణ శాఖకు చెందిన 2,450 ఎకరాల భూములను తెలంగాణకు అప్పగించాలని కోరారు. వరంగల్‌కు సైనిక్ సూల్ మంజూరు చేసినా నిర్మాణాలు జరగనందున అనుమతుల గడువు ముగిసిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో అనుమతుల గడువును పునరుద్ధరించాలని లేదా కొత్తగా మంజూరు చే యాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ.. నిరుపేదలకు వారి సొంత జాగాల్లో 25 లక్షల ఇండ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, వాటిలో 15 లక్షల ఇండ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి ఆవాస యోజన-అర్బన్ (పీఎంఏవై-యూ) కింద ఈ ఏడాది నిధులు పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటివరకు 1,59,372 ఇండ్లు మంజూరు చేసిందని, వాటి నిర్మాణం కోసం రూ.2,390.58 కోట్ల గ్రాంటు ప్రకటించినప్పటికీ రూ.1,605.70 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, మిగిలిన వాటిపి వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.