తెలంగాణ సివిల్ సప్లైస్ స్కాంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డినే ప్రధాన పాత్రధారులు అని అన్నారు. పౌరసరఫరాల శాఖలో కుంభకోణంపై ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాకర్, పెద్దిరెడ్డి సుదర్శన్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి సుదర్శన్ మాట్లాడుతూ.. పద్దెనిమిది నెలల క్రితం జరిగిన ధాన్యం కొనుగోలు టెండర్ల కుంభకోణంపై ఇప్పటికే 8సార్లు ప్రెస్‌మీట్ పెట్టినప్పటికీ కాంగ్రెస్ నుంచి గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ స్పందన లేదని తెలిపారు. ఇదే అంశంపై అసెంబ్లీలో తమ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు లేవనెత్తినప్పటికీ స్పందన రాలేదన్నారు. దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించామని పేర్కొన్నారు.
రైస్ మిల్లర్ల నుంచి బిడ్డర్లు ధాన్యం టన్నుకు రూ.2230 అదనంగా వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపించారని పెద్దిరెడ్డి ఆరోపించారు. అక్రమంగా డబ్బులు చేరిన 187 ఖాతాల వివరాలను సేకరించామని తెలిపారు. ఇందులో మనీలాండరింగ్ జరిగిందని పేర్కొన్నారు. తాము సేకరించిన ఆధారాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈడీతో పాటు సీబీఐ, డైరెక్టరేట్ ఆప్ ఇంటెలిజెన్స్‌కు కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 700 పేజీలకు పైగా బుక్లెట్ తయారుచేసి దర్యాప్తు సంస్థలకు పంపిస్తున్నామని చెప్పారు. ఈ కుంభకోణంలో తప్పకుండా దోషులకు శిక్ష పడుతుందని .. ఎవ్వరూ తప్పించుకోలేరని ఆశాభావం వ్యక్తం చేశారు.
పౌరసరఫరాల శాఖలో జరిగిన ఈ కుంభకోణంపై బీజేపీ స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగల ముఠాగా వ్యవహరిస్తుందని.. దండుపాళ్యం బ్యాచ్‌లా దోచుకుంటుందని ఆరోపించారు. ఈ దోపిడీని బయటపెట్టామని అన్నారు. రూ.423 కోట్లు వివిధ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయ్యాయని చెప్పారు. ఎన్నిసార్లు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు అడిగినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడమే ఈ కుంభకోణం జరిగిందని అనడానికి రుజువని అన్నారు. ఈ అవినీతి ఇంకా కొనసాగుతూనే ఉందని తెలిపారు.
అన్ని దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం: గంగుల
ధాన్యం కొనుగోలు టెండర్లలో మొదటి నుంచి అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రభుత్వ ఖజానాల్లోకి రావాల్సిన డబ్బులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపించారు. ఈ స్కాంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. అదే బీఆర్ఎస్ కార్యకర్తలపై చిన్న ఫిర్యాదు చేస్తేనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. పౌరసరఫరాల శాఖలో కుంభకోణంపై ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాకర్, పెద్దిరెడ్డి సుదర్శన్ మీడియాతో మాట్లాడారు.
ఈ కుంభకోణంపై ఏసీబీ ఎందుకు స్పందించడం లేదని గంగుల కమలాకర్ ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థల మీద తమకు నమ్మకం ఉందని ఆయన తెలిపారు. అందుకే రాష్ట్రంతో పాటు కేంద్రంలో ఎన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నాయో.. వాటన్నింటికీ ఈ కుంభకోణంపై ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ స్కామ్‌పై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పటికైనా నోరు తెరవాలని డిమాండ్ చేశారు.