హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయల్దేరారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు పయనమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.30 నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జి, కుంగిన పిల్లర్లను పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం సీఎం రేవంత్, మంత్రులు మీడియాతో మాట్లాడుతారు. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయల్దేరుతారు. శాసనసభ్యుల పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు.
అంతకుముందు అసెంబ్లీలో మేడిగడ్డ బ్యారేజీ అంశంపై సీఎం రేవంత్, మంత్రులు మాట్లాడారు. మేడిగడ్డకు అన్ని పార్టీలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని చూసొద్దామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఎప్పుడు ఇలా కాలేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అనంతరం శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. బ్యారేజీ సందర్శనకు కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు.