CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 15(నమస్తే తెలంగాణ): ప్రపంచ వాణిజ్య వేదిక (డబ్ల్యూఈఎఫ్)-2025 వార్షిక సదస్సు సందర్భంగా రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నది. గత ఏడాది కన్నా ఎక్కువ పెట్టుబడులు సాధించేందుకు కృషి చేస్తున్నది. వాస్తవానికి గత సంవత్సరం భారీగా పెట్టుబడి ఒప్పందాలు జరిగినా, వచ్చిన కంపెనీలు మాత్రం అరకొరే. ఉన్న కంపెనీలే విస్తరణ కార్యక్రమాలు చేపట్టాయి తప్ప కొత్తవి రాలేదు. మరోవైపు, ఈసారి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. కొత్త పారిశ్రామికవాడలను అభివృద్ధిచేసి తన సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిచయాలతో భారీగా పెట్టుబడులు సాధించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దీంతో ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర బృందం దావోస్ పర్యటనపై పరిశ్రమ వర్గాల్లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరగనున్నది. గత ఏడాది వచ్చిన పెట్టుబడుల కన్నా ఎక్కువ పెట్టుబడులు ఈసారి వస్తాయని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్తున్నారు. గత ఏడాది జరిగిన డబ్ల్యూఈఎఫ్-2024 వార్షిక సదస్సు సందర్భంగా రూ.40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో అదానీ గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ, వెబ్‌వర్స్, టాటా టెక్నాలజీస్, బీఎల్ఆగ్రో, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడిఎనర్జీ, అరజెన్ లైఫ్‌సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూసెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ తదితర కంపెనీలతో కుదిరిన ఒప్పందాలు ముఖ్యమైనవి. ప్రభుత్వం ప్రకటించిన రూ.40,232 కోట్లలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నిత్యం విమర్శించే అదానీకి సంబంధించినవే రూ.12,400 కోట్లు ఉండటం గమనార్హం.
గత ఏడాది కుదిరిన ఒప్పందాల్లో రూ.29,400 కోట్లు అదానీ, జేఎస్‌డబ్ల్యూ, గోడి ఇండియా కంపెనీలకు సంబంధించినవే కావడం విశేషం. ఈ మూడు కంపెనీలు ఇంకా కార్యకలాపాలు చేపట్టలేదు. రూ.12,400 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్న అదానీ గ్రూపు.. రూ.5 వేల కోట్లతో అదానీ గ్రీన్ఎనర్జీ 1,350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. చందన్వెల్లిలో అదానీ కొనెక్స్ డాటా సెంటర్, 100 మెగావాట్ల సామర్థ్యంతో డాటా సెంటర్ క్యాంపస్, రూ.1,400 కోట్లతో అంబుజా సిమెంట్స్, రూ.1000 కోట్లతో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ఒప్పందం చేసుకున్నది. వీటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. సూర్యాపేట జిల్లా రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటునకు ప్రజాభిప్రాయ సేవకరణ నిర్వహించగా, స్థానికులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటులో చేయూతనిచ్చేందుకు అదానీ గ్రూపు ముందుకొచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వారిచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరిగి వెనక్కు ఇవ్వడంతో స్కిల్ యూనివర్సిటీలో అదానీ పాత్ర ఉండదనే చెప్పవచ్చు.
జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో 1,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం గల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ థర్మల్, హైడ్రో, సౌర వనరుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. మన రాష్ట్రంలో ఇంతవరకూ దీనికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభం కాలేదు.
గోడి ఇండియా తెలంగాణలో రూ.8,000 కోట్ల పెట్టుబడితో ఆర్అండ్డీతోపాటు గిగాసేల్ బ్యాటరీసెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ యూనిట్లో బ్యాటరీసెల్ తయారు చేయనున్నట్టు ప్రకటించింది. రాబోయే ఐదేండ్లలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ), గిగా సేల్ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనున్నట్టు తెలిపింది. ఇందులోనూ ఎటువంటి పురోగతి లేదు.