హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ సమ్మిట్.. ప్రభుత్వం నిర్వహించిన సదస్సులా కాకుండా రేవంత్‌రెడ్డి సమ్మిట్‌లా మారిందా? సీఎం రేవంత్‌రెడ్డి ఓవైపు.. డిప్యూటీ సీఎం మరోవైపు.. వీరిద్దరిదే ‘షో’ నడిచిందా? వేదికైనా, ఒప్పందాలైనా, ప్రచార ఆర్భాటమైనా ఎక్కడ చూసినా వాళ్లిద్దరే ఉన్నారా? ‘గ్లోబల్’ సాక్షిగా ఇతర మంత్రులు అవమానాన్ని మూటగట్టుకున్నారా? ఈ అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? ముఖ్యమంత్రి తీరుపై రుసరుసలాడుతున్నారా? గ్లోబల్ సమ్మిట్ కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు పెట్టిందా? అంటే ఈ ప్రశ్నలకు పార్టీ, ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రెండురోజులపాటు సర్కారు ఊదరగొట్టిన గ్లోబల్ సమ్మిట్‌పై పెట్టుబడిదారులు, ప్రతినిధులే కాదు సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇది పెట్టుబడుల సదస్సుగా కాకుండా ‘సెల్ఫ్ ప్రమోషన్’ సదస్సుగా మారిందని మండిపడుతున్నారు. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి పార్టీలో, ప్రభుత్వంలో తీవ్ర విమర్శలకు దారితీసింది. అందర్నీ విస్మరించి ఆ ఇద్దరే ‘ఏలడం’పై పార్టీ నేతలు, మంత్రులు గుస్సా అవుతున్నారు.
ఎక్కడ చూసినా ఆ ఇద్దరే.. కానరాని ఇతర మంత్రులు
కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో ఎక్కడ చూసినా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలదే హవా కొనసాగింది. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం మొత్తం మరో మంత్రి ఫొటో కనిపించలేదు. ప్రాంగణానికి వెళ్లే దారి పొడవునా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, ఎల్ఈడీ తెరలు ఏర్పాటుచేశారు. ఏ ఫ్లెక్సీల్లో ఆ ఇద్దరి ఫొటోలే కనిపిస్తున్నాయి. వార్తా పత్రికలకు, చానళ్లకు కోట్లు వెచ్చించి ఇచ్చిన ప్రకటనల్లో, వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీలో, ప్రధాన వేదికపై ఇలా అక్కడా..ఇక్కడా అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా వాళ్లిద్దరి ఫొటోలే కనిపించాయి. మధ్యలో అక్కడక్కడ మంత్రి శ్రీధర్‌బాబుకు కాస్త చోటు ఇచ్చినట్టు కనిపించింది.
ఆయన ఐటీ, ఇండస్ట్రీ మంత్రి కావడంతోపాటు ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం ఉండటంతో ఆయనకు ఆ మాత్రం ప్రాధాన్యం ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కనీసం ఫ్లెక్లీల్లో అయినా ఇతర మంత్రుల ఫొటోలు పెట్టి ఉండాల్సిందని ఇటు పార్టీ, అటు ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితి లేదని మంత్రులు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య సీఎంలుగా ఉండగా మంత్రులను, పార్టీని అందరినీ కలుపుకొని, అందరి భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేసేవారని, కానీ ఇప్పుడు ఈ కొత్త ఆచారాన్ని చూస్తున్నామంటూ మండిపడుతున్నారు.
ప్రధాన వేదిక.. మంత్రులకు నో పర్మిషన్ !
గ్లోబల్ సమ్మిట్ వేదికగా తోటి మంత్రుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించిన అవమానకరమైన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు ప్రచారంలో గానీ, ఇటు గ్లోబల్ సమ్మిట్‌లో కూడా ఎక్కడా మంత్రుల ఫొటోలు లేకుండా జాగ్రత్తపడ్డారు. గ్లోబల్ సమ్మిట్ ప్రధాన వేదిక మీదికి ఇతర మంత్రులకు ‘నో పర్మిషన్’ విధానాన్ని అమలుచేసినట్టు తెలిసింది. అందుకే సదస్సు ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో వేదికపై సీఎం, డిప్యూటీ సీఎం తప్ప మరో మంత్రి కనిపించలేదు. సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి సదస్సు ప్రారంభ వేదికపై ఆసీనులయ్యారు. కానీ క్యాబినెట్ మంత్రులకు మాత్రం వేదికపై చోటు లేకపోవడం గమనార్హం.
అవమానం.. సీఎంపై మంత్రుల రుసరుస
గ్లోబల్ సమ్మిట్ సాక్షిగా తమకు జరిగిన అవమానంపై మంత్రులు లోలోపల రగిలిపోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై రుసరుసలాడుతున్నారు. మంత్రులు అంతర్గత సంభాషణల్లో సీఎంను తిట్టిపోస్తున్నారు. ఓ మంత్రి నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ… ‘మంత్రులమైన మాకే ఇంత అవమానమా? ఇది ప్రభుత్వ సదస్సా.. ప్రైవేటు సదస్సా..? ప్రభుత్వ పైసలతో ఒకరిద్దరు వ్యక్తిగత ప్రచారం చేసుకోవడం ఏంది?’ అని ప్రశ్నించారు. ఈ వివాదం కాంగ్రెస్‌లో మరో కొత్త పంచాయితీకి తెరతీసినట్టు చర్చ జరుగుతున్నది. తమకు జరిగిన అవమానంపై మంత్రులు వచ్చే క్యాబినెట్ భేటీలోగానీ, పార్టీ వేదికపైగానీ ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీన్ని ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంలో మంత్రులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న విధంగా మారిపోతుందని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఈ ఏకఛత్రాధిపత్యానికి ఇంతటితో ముగింపు పలికే ఉద్దేశంలో ఉన్నట్టు తెలిసింది.
విజన్ డాక్యుమెంట్లో సీఎంవి 10 ఫొటోలు
ప్రభుత్వ ఖర్చుతో రూపొందించిన, ప్రభుత్వం చేయాల్సిన పనులకు సంబంధించిన విజన్-2047 డాక్యుమెంట్లోనూ మంత్రులకు చోటు దక్కలేదు. ఈ విజన్ డాక్యుమెంట్లో ఒక్క సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో తప్ప మరే మంత్రి ఫొటో పెట్టలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కడివే ఏకంగా పది ఫొటోలు ఉన్నాయి. డాక్యుమెంట్ మొదటి పేజీల్లోనే చాయ్ తాగుతూ దీర్ఘాలోచన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో భారీ సైజులో దర్శనమిస్తుంది. తనకు ఇష్టమైన ఫుట్‌బాల్ ఆడుతున్న మరో ఫొటోను కూడా డాక్యుమెంట్లో ముద్రించారు. కనీసం మంత్రివర్గానికి సంబంధించి గ్రూప్ ఫొటోనైనా పెట్టకపోవడంపై మంత్రులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇది ప్రభుత్వం తరఫున రూపొందించిన డాక్యుమెంటా? లేక సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత డాక్యుమెంటా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ, పార్టీ సహకారం లేకుండా ఆయన ఒక్కడే ఈ విజన్‌ను అమలు చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
విజన్ డాక్యుమెంట్ విడుదలలోనూ లేని మంత్రులు
ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 విజన్ పేరుతో డాక్యుమెంట్‌ను రూపొందించింది. గ్లోబల్ సదస్సు ముగింపు సందర్భంగా వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి దానిని ఆవిష్కరించారు. ఆ సమయంలో వేదికపై సీఎంతోపాటు డిప్యూటీ సీఎం, సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక నిపుణులు, సినీనటుడు చిరంజీవి ఉన్నారు. కానీ మరో మంత్రికి వేదికపై స్థానం కల్పించలేదు. ప్రభుత్వం తరఫున రూపొందించిన, అమలు చేయాల్సిన విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగానైనా వారికి చోటు కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరీ ఇంత దారుణంగా మంత్రులను అవమానించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.