గతంలో ఉన్నట్టు చట్ట సభల్లో హుందాతనం ఈ రోజు తెలంగాణలో లేదు.. ఈ రోజు చట్ట సభల్లో మాట్లాడేవాళ్లకు ఎన్ని తిట్లు తిట్టావు? ఎంత చెడ్డగా తిట్టావు? ఎంత చెండాలంగా మాట్లాడావు? అనే పోటీ జరుగుతున్నది. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు.. రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే చిన్న పిల్లలను టీవీ చానల్స్ మార్చాలనే దుస్థితి ఈ రోజు తెలంగాణలో వచ్చింది.
-శుక్రవారం ఓ పుస్కకావిష్కరణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌కు అసలు తెలంగాణ సమాజంలోనే జీవించే హక్కు లేదు. జనజీవన స్రవంతిలో లేనోళ్ల ముందు వరుసలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, పోంచపల్లి అంతా ఉన్నరు.
– శుక్రవారం కులగణన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : ఉద్యమనేత, తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శుక్రవారం నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ సకల జనుల సర్వే లెక్కలన్నీ కాకిలెక్కలు.. ఇస్తరాకుల లెక్కగట్టి ఇదే కరెక్టని కాకి లెక్కలు చూపెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేపై మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదు.. సర్వేలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన కొడుకు, అల్లుడు లెక్కలు రాపిస్తే ఆయనకు అడిగే అధికారం ఉండేది.. అసలు కేసీఆర్‌కు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే లేదు’ అంటూ దురుసుగా మాట్లాడారు.
‘రాష్ట్రంలో సర్వేలో పాల్గొన్నవారంతా జనజీవన స్రవంతిలో ఉన్నవాళ్లు.. సర్వేలో పాల్గొనని 16 లక్షల మంది జనజీవన స్రవంతిలో లేనోళ్లు.. వీరిలో ముందు వరుసలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, పోంచపల్లి అంతా ఉన్నరు’ అంటూ మాట్లాడి కేసీఆర్ కుటుంబంపై తన అక్కసు వెళ్లగక్కారు. అంతకుముందు మాజీ మంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ రాసిన పుస్తకావిష్కరణ సభలో రేవంత్ మాట్లాడుతూ ‘ఈ రోజు చట్ట సభల్లో మాట్లాడేవాళ్లకు ఎన్ని తిట్లు తిట్టావు? ఎంత చెడ్డగా తిట్టావు? ఎంత చెండాలంగా మాట్లాడావు? అనే పోటీ జరుగుతున్నది. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు’ అంటూ సుభాషితాలు పలికి.. కొద్దిసేపటికే గాంధీభవన్‌లో కేసీఆర్‌పై నోరు పారేసుకోవడంపై రాజకీయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతున్నది. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కేసీఆర్ అభిమానులు, తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు.