Revanth Reddy | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తమ ప్రభుత్వం గడిచిన 14 నెలల్లో రూ.1,58,041 కోట అప్పు చేసినట్టు సీఎం రేవంత్రెడ్డి అంగీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను శనివారం అసెంబ్లీలో వెల్లడించారు. 2023 డిసెంబర్ నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేసినట్టు వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు, వడ్డీ కట్టడానికే తాము చేసిన అప్పులు సరిపోతున్నాయని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తాము చేసిన రూ.1.58 లక్షల కోట్ల అప్పులో రూ.88,591 కోట్లను అసలు, రూ.64,768 కోట్లను మిత్తీలకు కట్టాల్సి వచ్చిందని తెలిపారు. మొత్తం రూ.1,53,359 కోట్లను పాత అప్పులు, మిత్తీలకే కట్టినట్టు చెప్పారు. తన ప్రభుత్వం చేసిన అప్పుల తప్పులను కేసీఆర్ ప్రభుత్వానికి అంటగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో సీఎం అడ్డంగా దొరికిపోయారు. 14 నెలల్లో రాష్ర్టానికి వచ్చిన ఆదాయం ఏమైంది, ఎటుపోయిందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇం దుకు సీఎం రేవంత్రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలనే ఉదహరిస్తున్నారు.