వరంగల్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ మరోసారి అస్పష్ట ప్రకటన చేశారు. పునర్విభజన చేయబోమని చెప్తూనే, మరోవైపు, చే యాలనుకుంటే అసెంబ్లీలో చర్చించాకే నిర్ణ యం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆదివా రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ జిల్లాల పునర్విభజన అంశాన్ని ప్రస్తావించారు. ‘ఉన్న జిల్లాల ను తొలగించేది లేదు. కొత్త జిల్లాలను ఏర్పా టు చేసేది లేదు. ఒకవేళ జిల్లాల పునర్విభజన చేయాలనుకుంటే అసెంబ్లీలో చర్చించి, ప్రతిపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. దీంతో మున్సిపల్ ఎన్నిక ల్లో తాము ఏ వైఖరి ప్రదర్శించాలో తెలియక కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాల పునర్విభజన చేయబోమని కరాఖండిగా చెప్తే అయిపోయేది. అలాకాకుండా చే యాలనుకుంటే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రే పేర్కొనడంతో.. ‘ఇంతకీ ఈ జిల్లా ఉంటుం దా? ఉండదా? అనే అంశంపై మనకే స్పష్టత లేకపోతే ప్రజలకేం చెప్తాం’ అని బహిరంగసభ అనంతరం కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. విషయాన్ని సీఎం ప్రస్తావించకపోయినా బాగుండేదని, దాని ప్రభావం ఈ ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుందని వాపోతున్నారు.
రేవంత్ నోట మళ్లీ ఎన్టీఆర్ పాట
సీఎం రేవంత్ మరోసారి ఎన్టీఆర్ పాటపాడారు. ఇటీవల ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రం లో దుమా రం రేగింది. అది సమసిపోకముందే పుండుమీద కారం చల్లిన ట్టు భూపాలపల్లిలోనూ ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తారు. ఎన్టీఆర్ సింగరేణి గనులను ఏర్పాటు చేసి భూపాలపల్లి అభివృద్ధికి పునాది వేశారని, అనంతరం భూపాలపల్లిని కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని రేవంత్వ్యా ఖ్యానించడంతో అంతా అయోమయానికి గు రయ్యారు. ‘ఆనాడు ఐదారువందల జనాభా ఉన్న భూపాలపల్లి గ్రామాన్ని అన్న.. ఎన్టీ రామారావు మండల కేంద్రంగా మార్చారు. అప్పటి నుంచి భూపాలపల్లి ఇక వెనుదిరిగి చూడలేదు. అప్పటి నుంచి మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే భూపాలపల్లి అభివృద్ధి జరిగింది’ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సభలోనే గుసగుసలు వినిపించాయి. భూ పాలపల్లిని మున్సిపాలిటీగా, రెవెన్యూ డివిజన్‌గా, జిల్లాగా చేసిందీ, జిల్లాకు ప్రొఫెసర్ జ యశంకర్ పేరు (జయశంకర్-భూపాలపల్లి) పెట్టిందీ అన్నీ కేసీఆర్ హయాంలో అయితే, ఎన్టీఆర్ పేరు, కాంగ్రెస్ పేరు ప్రస్తావించడం ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సింగరేణి బోర్డుపై మళ్లీ మెలిక
సింగరేణిలో కారుణ్య నియామకాలపై రేవంత్ మరో మెలిక పెట్టారు. 11 నెలలుగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తున్న నేపథ్యంలో వెంటనే బోర్డు ఏర్పాటు చేస్తామని కానీ, కారుణ్య నియామకాలు కొనసాగిస్తామని కానీ సీఎం ప్రకటించలేదు. భూపాలపల్లి ఏరియాలో 217 మంది డిస్మిస్ కార్మికులు ఉన్నారని, వారిని విధుల్లోకి తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సీఎంను కోరినా స్పష్టమైన హామీ రాకపోవడంతో సింగరేణి కార్మికుల్లో అయోమయం నెలకొన్నది.
భట్టి నుంచి ఆర్థిక శాఖ అవుటా?
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యవేక్షిస్తున్న ఆర్థిక శాఖ ఆయన పరిధిలోంచి వెళ్లిపోతున్నదా? ఆర్థిక శాఖ చెల్లింపులపై ఇటీవల వస్తున్న వరుస ఆరోపణల నేపథ్యంలో సీఎం రేవంత్, భట్టికి ‘ఎర్త్’ పెట్టనున్నారా? అనే చర్చ కాంగ్రెస్‌లో సాగుతున్నది. ఆదివారం భూపాలపల్లిలో సీఎం రేవంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘మున్సిపల్ శాఖ నా పరిధిలోనే ఉన్నది. మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులే గెలవాలి. సంతకం పెట్టేది నేను. నిధులు ఇచ్చేది శ్రీధర్‌బాబు. మమ్మల్ని సమన్వయం చేసేది సత్తెన్న (భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు)’ అని రేవంత్ పేర్కొన్నారు. దీంతో సభావేదిక మీద ఉన్నవారిలో అనేకమంది ఒక్కసారిగా సీఎం వంక ఆసక్తిగా చూడటం గమనార్హం. కాగా, సీఎంగా రేవంత్‌రెడ్డి సంతకం పెట్టొచ్చు కానీ, నిధులు విడుదల చేసేది ఆర్థిక మంత్రి. ఆర్థిక శాఖతోపాటు గనుల శాఖ కూడా భట్టి వద్ద ఉన్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖలు మంత్రి శ్రీధర్‌బాబు వద్ద ఉన్నాయి. ఉన్న పళంగా సీఎం రేవంత్ ఆ విధంగా వ్యాఖ్యానించడంతో శాఖల మార్పు జరుగబోతున్నదా? అనే అనుమానాలు వ్యక్తమతున్నాయి.