మెట్రోపై ఆవేశపు ప్రకటనలే తప్ప, ఆచరణయోగ్యమైన ప్రణాళికేదీ లేదని.. కేంద్రం నిబంధనలకు విరుద్ధంగా రేవంత్ సర్కార్ వ్యవహరించడమే రుణం రాకపోవడానికి కారణమైందని మరోసారి స్పష్టమైంది. ఢిల్లీలో సోమవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రిని కేంద్రం కడిగిపారేసినట్టు సమాచారం. రుణం, డీపీఆర్, ఆర్ఆర్టీఎస్.. ఇలా ఒక్కో అంశంపై వరుస ప్రశ్నలతో సీఎం ఉక్కిరిబిక్కిరైనట్టు తెలిసింది.
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : మెట్రోరైల్ స్వాధీనం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్‌రెడ్డి రుణం కోసం ప్రయత్నించారా? ఈ నిబంధనే రుణం సంకటంలో పడేలా చేసిందని కేంద్రం తేల్చి చెప్పిందా? రైల్వే శాఖ పరంగా ఎలాంటి అడ్డంకులు లేవని, వెళ్లి పట్టణాభివృద్ధి శాఖ వద్ద తేల్చుకోవాలని స్పష్టం చేసిందా? అంటే.. సోమవారం ఢిల్లీలో జరిగిన పరిణామాలపై ఆరా తీస్తే ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది. మెట్రోరైల్ ఫేజ్-2 అనుమతులు, పెండింగ్ నిధులపై చర్చించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. ముగ్గురి మధ్యా దాదాపు రెండు గంటల పాటు చర్చలు కొనసాగాయి. అంతిమంగా రైల్వే శాఖ పరంగా ఎలాంటి అడ్డంకులు లేవని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతోనే తేల్చుకోవాలని కేంద్రం తేల్చిచెప్పినట్టు సమాచారం. జపాన్ నుంచి నేరుగా రుణం వచ్చిందని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారంటూ రేవంత్‌ను భేటీలోనే కడిగిపారేసినట్టు తెలిసింది. అక్కడి నుంచి బేలగా బయటకు వచ్చిన సీఎం, మంగళవారం కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ఖట్టర్‌ను కలువనున్నట్టు తెలిసింది.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఫేజ్-1కు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇప్పటివరకు రూ.1,204 కోట్లు ఇచ్చామని, కానీ.. ఫేజ్-1, ఫేజ్-2 విషయంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న తీరు తన అసమర్థ విధానాలను ప్రతిబింబిస్తున్నదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఫేజ్-2 విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్న సమయంలోనూ చొరవ తీసుకొని రెండు ప్రత్యామ్నాయాలను సూచించినట్టు తెలిపింది. రూ.10 వేల కోట్లు తక్కువ ఖర్చయ్యేలా ఆర్ఆర్టీఎస్ ఫార్ములాను సూచించామని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని తెలిపింది. రాష్ట్రం చెప్పిన ఫార్ములా ప్రకారం సహకరించేందుకు అంగీకరించినా రేవంత్ ఎందుకు అసహనం ప్రదర్శిస్తున్నాడో అర్థం కావడం లేదని పేర్కొన్నది.
ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో అనేకసార్లు మార్పులు చేస్తున్నా, డీపీఆర్ సరిగ్గా సమర్పించకపోయినా వాటిని స్వీకరిస్తూ రాష్ర్టానికి నిర్మాణాత్మక సలహాలు, సహకారాన్ని అందించామని కేంద్రం వెల్లడించింది. అయినా సీఎం రేవంత్‌రెడ్డి ఐఆర్ఎఫ్సీ గురించి, ఎల్అండ్టీ-ఐఆర్ఎఫ్సీ ఒప్పందం గురించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, జపాన్ ప్రభుత్వం నుంచి మెట్రో ప్రాజెక్టుకు నేరుగా రుణం వచ్చిందని చెప్పడం పూర్తిగా అబద్ధమని కేంద్రం కడిగిపారేసినట్టు తెలిసింది.
భారతదేశంలో మౌలికవసతుల ప్రాజెక్టులకు జపాన్ 25 ఏండ్లుగా సంపూర్ణ సహకారం అందిస్తున్నది. ఢిల్లీ మెట్రోలో జైకా మొట్టమొదటిసారిగా భారీగా పెట్టుబడులు పెట్టింది. 2002లో నాటి ప్రధాని వాజపేయి 8.3 కిలోమీటర్ల ఢిల్లీ మెట్రో ఫస్ట్ సెక్షన్ (రెడ్ లైన్ – 6 స్టేషన్లు)ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు జపాన్ రూ.55 వేల కోట్ల రుణాన్ని మంజూరుచేసింది. 2026లో జపాన్ ప్రభుత్వం అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (ఓడీఏ) రుణాలు ఇచ్చింది. బెంగళూరు ఫేజ్-3 మెట్రోకు రూ.6,100 కోట్లు, ముంబై మెట్రో లైన్ 11 ప్రాజెక్టు-1కు రూ.5,500 కోట్లు ఇచ్చింది. ఇది కాకుండా చెన్నై మెట్రో, అహ్మదాబాద్ మెట్రోకు కూడా జపాన్ ప్రభుత్వం సహకరిస్తున్నది. తమకు కూడా జపాన్ బ్యాంకు డబ్బులిస్తున్నదని రేవంత్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ అసలు విషయం ఏంటంటే జపాన్ ప్రభుత్వం సహకరిస్తామని చెప్తున్నా వారితో ఒప్పందం కుదుర్చుకోలేకపోవడం రేవంత్ అసమర్థత, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్‌కు నిదర్శనం కాదా? అని కేంద్రం అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇది తెలంగాణ ప్రజలను నిట్టనిలువునా మరోసారి మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1కు సంబంధించి ఎల్అండ్టీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం విషయంలో అసలు రేవంత్ ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉన్నదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 69 కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ఎల్అండ్టీ నుంచి తెలంగాణ ప్రభుత్వం టేకోవర్‌కు కావాల్సిన రూ.15,000 కోట్ల ఫైనాన్సింగ్ కోసం ఐఆర్ఎఫ్సీతో చర్చలు జరిగాయి. ఇందులో సుమారు రూ.13,500 కోట్ల రుణం, రూ.1,500 కోట్లు ఈక్విటీ/క్యాష్ కాంపోనెంట్గా ప్రతిపాదించారు.
మెట్రో ద్వారా వచ్చే మొత్తం రెవెన్యూను ఎస్క్రో (తటస్థ మూడో పక్షం) అకౌంట్లో వేయాలి. అంటే టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం, ప్రకటనల ఆదాయంపై ఫస్ట్ చార్జీ ఐఆర్ఎఫ్సీకే ఉంటుంది. వచ్చే ఆదాయం నుంచి ముందుగా ఐఆర్ఎఫ్సీ రుణాల చెల్లింపు చేయాలి. తరువాత మెట్రో ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ఖర్చులకు డబ్బు తీసుకోవాలి. మెట్రోపై వచ్చిన ఆదాయం వెంటనే ప్రభుత్వం లేదా మెట్రో యాజమాన్యం దాన్ని తమ ఇష్టానుసారం వినియోగించుకోలేరు.
కేంద్ర మంత్రులతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం వేర్వేరు కాదు. మీరు కిషన్ రెడ్డిని తిడుతూ కేంద్రం వద్ద సహాయం ఎలా అడుగుతారు? మెట్రోపై మీకసలు చిత్తశుద్ధి లేదు. అందుకే ఇలా మా ట్లాడుతున్నారా? ఖట్టర్‌ను కలవండి. అంతా ఒకే అనుకుంటే అప్పుడు చూద్దాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా రేవంత్ సీఎం కాకముందు నుంచే తాను హైదరాబాద్ మెట్రో కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని పలుమార్లు కలిసి నివేదికలు అందజేసినట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారులను త్వరగా నామినేట్ చేయాలని, తద్వారా ప్రక్రియ ఆలస్యం కాకుండా మెట్రో విస్తరణ వేగవంతం అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించానని వివరించారు. కానీ తనపై ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.