హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళల భద్రత కోసం, ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేకంగా రూపొందించిన ‘ట్రావెల్ సేఫ్’ (టీ-సేఫ్) యాప్ అద్భుతంగా ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. మంగళవారం ఆయన సచివాలయంలో టీ-సేఫ్ సేవలను ప్రారంభించి, ఈ యాప్‌ను తెలంగాణ మహిళలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో టీ-సేఫ్ సేవలు ఎంతో ఉపకరిస్తాయని, సురక్షిత ప్రయాణం కోసం మహిళలు, పిల్లలు సహా ఎవరైనా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఎక్కడైనా ఆపద తలెత్తినప్పుడు టీ-సేఫ్ ద్వారా 100 లేదా 112 నంబర్‌కు కాల్చేసి 8వ నంబర్‌ను ఎంచుకుంటే నిమిషాల్లో పెట్రోలింగ్, బ్లూకోల్ట్ వాహనాలు అందుటుబాలోకి వస్తాయని, ఆపదలో చిక్కుకున్నవారు తమ లైవ్ లొకేషన్‌ను టీ-సేఫ్ యాప్ ద్వారా సన్నిహితులకు పంపొచ్చని వివరించారు. టీ-సేఫ్ సేవల కోసం ప్రత్యేకంగా 791 పెట్రోలింగ్ కార్లు, 1085 బ్లూ కోల్ట్ వాహనాలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. భవిష్యత్‌లో క్యాబ్ అగ్రిగేటర్లు, ప్రైవేట్ రవాణా వ్యవస్థల్లో కూడా టీ-సేఫ్ సేవలను తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయెల్, ఏడీజీలు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలుపాల్గొన్నారు.