హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను నియంత్రించేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నిస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపణలకు దిగారు. ప్రభు త్వ తీరు ఎలా ఉన్నది అంటే.. దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది. వాస్తవంగా ఆదివారం సభ ప్రారంభమైన అనంతరమే హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు.
నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. కానీ, స్పీకర్ వారికి మైక్ ఇవ్వలేదు. అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు స్పీకర్ వద్దకు వెళ్లడం, గుసగుసలు పెట్టడం పరిపాటిగా మారింది. ఆ తరువాత స్పీకర్ కోరిన కాంగ్రెస్ నేతలు మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం గమనార్హం. ఇదే విషయమై ఎవరు ఎవరిని నియంత్రిస్తున్నారో కండ్ల ముందే కనబడుతున్నదంటూ బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతినే ఆదేశిస్తున్నారంటూ బీఆర్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని తిరిగి సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించడం, తదుపరి సస్పెండ్ చేయడం గమనార్హం.