CM Revant Reddy | గ్రేటర్ హైదరాబాద్ సిటీ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వివిధ దేశాల్లో అమలవుతున్న బెస్ట్ పాలసీని పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోనే అత్యుత్తమ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని హైదరాబాద్ లో అమలు చేయాల్సి ఉందని చెబుతూ సీఎం తన తన ఆలోచనలను అధికారులతో పంచుకున్నారు. విద్యుత్ కేబుళ్లతోపాటు అన్ని రకాల కేబుళ్లకు అండర్ గ్రౌండ్ లోనే ఏర్పాటు చేసేందుకు గల వివిధ ప్రత్యమ్నాయాలు పరిశీలించాలని చెప్పారు.
అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడంతోపాటు విద్యుత్ చౌర్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ అంతరాయం వంటి సమస్యలను అధిగమించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. వచ్చే వేసవిలో విద్యుత్ సరఫరా కు ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా డిస్కంలు సన్నద్ధంగా ఉండాలని చెప్పారు.
శనివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం విద్యుత్ శాఖ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జెన్ కో సీఎండీ సందీప్ సుల్తానియా, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, డిస్కం సీఎండీలు ముషారఫ్, వరుణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, టీజీ రెడ్కో ఎండీ అనీల, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గత ఏడాది మార్చిలో రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15623 మెగా వాట్లకు చేరిందని, ఈసారి 16877 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. గరిష్ఠ విద్యుత్ డిమాండ్ అంచనాకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు ప్రణాళిక చేసుకోవాలని వారిని సీఎం ఆదేశించారు.
వ్యవసాయానికి, గృహ అవసరాలకు మార్చి నెలలో ఉండే పీక్ డిమాండ్కనుగుణంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆదేశించారు.
విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో రోజు రోజుకు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా జరగాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వచ్చినా వెంటనే సమీపంలోని మరో ఫీడర్ నుంచి ప్రత్యమ్నాయంగా సరఫరా చేసే వ్యవస్థను సమర్థంగా అమలు చేయాలని చెప్పారు.
ఆదివాసీ గూడేలలో గృహాలకు సోలార్ విద్యుత్, సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అటవీశాఖ, గిరిజన సంక్షేమం శాఖతోపాటు సంబంధిత శాఖలతో సమావేశమై వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలన్నారు.
పూర్తి నివేదిక ఆధారంగా ఆదివాసీ గూడేలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సోలార్ విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆఫీసులు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే కంపెనీలను ఆహ్వానించి ఏ విధానంలో వారికి పనులను అప్పగించాలనే ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు.ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాన్నిపరిశీలించాలన్నారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా ముందుకు తీసుకు వెళ్లాలని అన్నారు.
పరిగి వద్ద 400 కేవీ సబ్ స్టేషన్ మంజూరయినా పదేళ్లుగా పెండింగ్ లో ఉందని.. దానికి సంబంధించిన పురోగతి నివేదికను అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గోషామహల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మించనున్న నేపథ్యంలో స్టేడియం పక్కనే ఉన్న సబ్ స్టేషన్ ను మరోవైపు తరలించాలని సూచించారు. మరింత అదనపు సామర్థ్యంతో పూర్తిగా అధునాతన టెక్నాలజీతో ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.