Tirupati Reddy | వికారాబాద్/పూడూరు, నవంబర్ 13, (నమస్తే తెలంగాణ): లగచర్ల ఘటనపై కలెక్టర్‌ను కలిసేందుకు మందీమార్బలంతో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి సీఎం స్థాయిలో ప్రొటోకాల్ కల్పించడం వివాదాస్పదమైంది. ఏ హోదా లేని తిరుపతిరెడ్డి కోసం కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, అధికారులు బయటకువచ్చి స్వాగతం పలకడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే ఘటనకు సంబంధించి కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను మాత్రం మన్నెగూడ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకోవడం గమనార్హం.
వార్డుమెంబర్ కూడా కాని తిరుపతిరెడ్డికి ఎస్కార్టా?
వికారాబాద్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న తనను అడ్డుకోవడంపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తంచేశారు. వార్డు మెంబర్ కూడా కాని తిరుపతిరెడ్డిని ఎస్కార్ట్‌తో పంపించి, ఎంపీనైన తనను అడ్డగించి అవమానించడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. అరుణను అడ్డగించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. పోలీసులు తనను అడ్డుకున్న విషయాన్ని అరుణ ఫోన్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీని పంపించాలని పోలీసులకు కలెక్టర్‌కు చెప్పడంతో వారు వికారాబాద్ పంపించారు.
మధ్యాహ్నం నుంచి వాహన తనిఖీలు
లగచర్ల ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న మాజీమంత్రి హరీశ్‌రావు వస్తున్నారన్న సమాచారంతో హైవేపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. పూడూరు మండలం చన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా హైవేపై విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి.