హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి జిల్లాలోని వరద పీడిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం చేపట్టిన పర్యటన కాంగ్రెస్ పార్టీలోని ఆధిపత్య పోరును మరోసారి తెర మీదకు తెచ్చింది. జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేత ఆధిపత్య పోరుతో సీఎం షెడ్యూల్ మార్చుకోవాల్సి వచ్చిందనే చర్చ జరుగుతున్నది. గత వందేండ్లలో ఎన్నడూ లేనంతగా కురిసిన వర్షాలతో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం కకావికలమైంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం మోతే గ్రామంలోని ముంపు భూములను, లింగంపల్లి వద్ద దెబ్బతిన్న కుర్దు వంతెనను పరిశీలిస్తూ ఎల్లరెడ్డి మండలంలోకి ప్రవేశించాల్సి ఉన్నది. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి, బాధిత రైతులతో మాట్లాడాల్సి ఉన్నది.
అనంతరం అదే నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలో తీవ్రంగా దెబ్బతిన్న పోచారం ప్రాజెక్టును సందర్శించి, అక్కడ బాధిత రైతులతో మాట్లాడాల్సి ఉన్నది. అనంతరం వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలు, చెరువులు, వాగుల పరిస్థితిపై ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించాల్సి ఉన్నది. ఇందుకోసం అధికారులు నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మద శివారులోని పాలిటెక్నిక్ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్ వేదికను ఏర్పాటుచేశారు. అక్కడే వరద నష్టం మీద సీఎం సమీక్షా సమావేశం నిర్వహించే విధంగా షెడ్యూల్ ఖరారైంది.
అయితే, అనూహ్యంగా సీఎం పర్యటన షెడ్యూల్ మారింది. భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన నాగిరెడ్డిపేట మండలంలో పర్యటించలేదు. మండలంలోని పోచారం ప్రాజెక్టును, పంట పొలాలను పరిశీలించకుండానే తిరుగు ప్రయాణమయ్యారు. సీఎం పర్యటన షెడ్యూల్ మారడం వెనుక కాంగ్రెస్ పార్టీకే చెందిన ఒక సీనియర్ నేత హస్తం ఉన్నదని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఒకప్పుడు సదరు సీనియర్ నేత ఆధిపత్యంలో ఉండేది. గతంలో ఆయన ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను పక్కనపెట్టి కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడున్న నేతకు టికెట్ ఇచ్చింది. అప్పటినుంచే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. ఆ ఆధిపత్య పోరులో భాగంగానే సీనియర్ నేత రంగప్రవేశం చేసి రాత్రికి రాత్రే సీఎం షెడ్యూల్‌ను మార్పించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఒక్క నియోజకవర్గంలోనే పర్యటించి పోతే తాము తలెత్తుకోలేమని, జిల్లాపై తన ఆధిపత్యం పోతుందని, పైగా అతను మీ కంటే (సీఎంతో) ఓ సీనియర్ మంత్రికి అతిసన్నిహితంగా ఉంటారని చెప్పి సీఎం మీద ఒత్తిడి చేసినట్టు స్థానిక కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వరదలో కూడా ఇదేం బురద రాజకీయాలు అని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేసి దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, మౌలిక వసతులను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే మదన్మోహన్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.