కరీంనగర్ : పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ మాచర్ల గార్డెన్లో లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. దేశం మొత్తం మీద సామాజిక పింఛన్లను పెద్ద సంఖ్యలో అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అందుతున్న పెన్షన్లలో కేంద్రం వాటా వందలో కేవలం రూ.1.80 పైసలు మాత్రమే అని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ వెనుకబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేసినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని మంత్రి తెలిపారు.
అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నగరంలో గతంలో 20,768 పెన్షన్లు మాత్రమే ఉండేవని , కొత్తగా 5,678 మంజూరయ్యాయని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఆసరా పెన్షన్లు నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు.
పెన్షన్ రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ స్వరూప రాణి, అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ తదితరులు పాల్గొన్నారు.