హైదరాబాద్ : నదుల పరిరక్షణ, పునరుద్ధరణకు సీఎం కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మిషన్‌కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నారన్నారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆదివారం జరిగిన నేషనల్ కన్వెన్షన్ ఆన్ రివర్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయతో పడ్డ ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి.. ఆయకట్టు పెంచుకున్నామని, అలా రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించుకున్నామన్నారు.
దీంతో భారీ వర్షాలు పడినా చెరువు కట్టలు తగిపోలేదని, భూగర్భ జలాలు పెరిగాయన్నారు. 4వేల చెక్‌డ్యామ్‌లను రూ.6వేలకోట్లతో నిర్మించుకున్నామన్నారు. తద్వారా భూగర్భజలాలు పెరిగి.. సంవత్సరం అంతా చెరువులను వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదని సీఎం కేసీఆర్ నిరూపించారన్నారు. 141 టీఎంసీల రిజర్వాయర్లను గోదావరి నదిపై నిర్మించుకున్నామని, భవిష్యత్ తరాల కోసం నదులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చాలా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
2014 తలసరి ఆదాయం రూ.1,24,104ఉంటే.. 2021 తలసరి ఆదాయం రూ.2,78,933కు పెరిగిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం రెండింతల వృద్ధి నమోదైందన్నారు. 2014లో జీడీపీ రూ.5,500 ఉండగా.. 2021లో జీడీపీ రూ.11,54,000 పెరిగిందన్నారు. తలసరి ఆదారంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉందన్నారు. మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని, ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీలెవల్ సాగునీటి ప్రాజెక్టు అని తెలిపారు.
మూసీ పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారని, కొద్ది రోజుల్లోనే వాటి పనులు మొదలుపెడుతారన్నారు. మూసీ నదిపై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో 13 జలాల్లో సాగునీరు అందుతుందని, ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ తాగునీరు కూడా అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.