వేలేరు, సెప్టెంబర్ 30 : ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయగా, గత ఫిబ్రవరిలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వేలేరు మండలంలోని సోడాషపల్లి గ్రామంలో పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అవి పూర్తి కావడంతో శనివారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి గుండ్లసాగర్ శివారులో ఏర్పాటు చేసిన లిప్ట్ పైపులైన్ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఎకరం తడిసేలా సాగునీరు అందించేందుకే సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలైన వేలేరు, ధర్మసాగర్, చిల్పూర్ మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అందించేందుకు నిధులు మంజూరు చేశారని చెప్పారు.
గత ఫిబ్రవరిలో మంత్రి కేటీఆర్ సోడాషపల్లిలో లిఫ్ట్ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేయగా సూమారు 6 నెలల్లో పనులు పూర్తి చేసి పైపులైన్ ద్వారా సాగునీరు అందించడానికి అధికారులు, మండల ప్రజాప్రతినిధులు కృషి చేసినట్టు తెలిపారు. గుండ్లసాగర్ శివారులో ఏర్పాటు చేసిన లిఫ్ట్ పైపులైన్ ద్వారా వేలేరు, లోక్యాతండా, మిరపకుంట తండా, ఎర్రబెల్లి గ్రామాలకు సాగునీరు అందుతుందని చెప్పా రు. ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, నారాయణగిరి గ్రామాలకు సైతం సాగునీరు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. లిఫ్ట్-2 ద్వారా నష్కల్, ధర్మారం, వంగాలపల్లి గ్రామాలకు సాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయని, చిల్పూరు మండలంలోని పలు గ్రామలకు సైతం సాగునీరు చేరుతుందని అన్నారు. త్వరలోనే ఆయా గ్రామాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుందని వివరించారు. లిఫ్ట్-3లో భాగంగా కన్నారం గ్రామ చెరువులోకి సాగునీరు అందించేందుకు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. వచ్చే యాసంగి వరకు పైపులైన్ పనులు పూర్తి చేసి, కన్నారం, పీచర, వావిల్లకుంట గ్రామాలకు సైతం సాగునీరు అందిస్తామని చెప్పారు. గుండ్లసాగర్ శివారులోని పైపులైన్ వద్ద ఎమ్మెల్సీ పల్లా పూజలు చేసి నీటిని విడుదల చేయగా పలు గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకొన్నారు. సాగునీరు అందించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ పల్లాకు రైతులు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞ్ఞతలు తెలిపారు.