సీఎం సేవలు దేశానికి అవసరం: ఎమ్మెల్సీ కవిత
తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు
అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి
తిరుమల, నాంపల్లి క్రిమినల్ కోర్టు, హైదరాబాద్, ఫిబ్రవరి 17 : దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక పాత్రధారి అని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిరంతరం ప్రజాసేవకు పాటుపడాలని, ఆయన సేవలు యావత్తు దేశానికి అవసరమని వ్యాఖ్యానించారు. గురువారం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఆంధ్రప్రదేశ్‌లోని కేసీఆర్ అభిమానులు, మద్దతుదారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. వారి సమక్షంలోనే కవిత కేక్ కట్ చేశారు. అనంతరం తిరుపతిలో రాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమంలో కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడారు. భర్త అనిల్‌తో కలిసి వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం అలిపిరిలోని సప్తగో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించుకొన్నారు. గోపూజ చేశారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకొని వేంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజానేత కేసీఆర్ పుట్టినరోజును యావత్తు తెలంగాణ పండుగలా చేసుకొంటున్నదని తెలిపారు. కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతక్షతలు చెప్పారు. తెలుగు రాష్ర్టాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఇద్దరు సీఎంలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
107 స్థానాల్లో డిపాజిట్లు రాని పార్టీ విమర్శించటమా?
దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ చక్రం తిప్పుతుందని, కేంద్రంలో సీఎం కేసీఆర్ చురుకైన పాత్ర పోషిస్తారని కవిత చెప్పారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని బీజేపీ ఎప్పుడో కోల్పోయిందని అన్నారు. 107 స్థానాల్లో కనీసం డిపాజిట్లు రాని బీజేపీ తమపై దుష్ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. తిరుమలలో ఏదో గొప్పదనం దాగి ఉన్నదని, పాదాల మండపం వద్దకు రాగానే మనసు భక్తిభావంతో నిండిపోయిందని పేర్కొన్నారు. కవితతో పాటు టీఆర్ఎస్ లీగల్‌సెల్, జాగృతి లీగల్ సెల్ న్యాయవాదులు తిరుపతి వర్మ, వినయ్‌కుమార్, జక్కుల లక్ష్మణ్, చందు తదితరులు వెంకన్న దర్శనం చేసుకొన్నారు. కాగా ట్విట్టర్లోనూ ‘నేను ప్రతి రోజు మీ దగ్గర ఏదోఒకటి నేర్చుకుంటూ ఉంటాను. మీరే ఓ వ్యవస్థ. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలి’ అని సీఎం కేసీఆర్‌కు కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.