హైదరాబాద్ : ఈ నెల 16న మధ్యాహ్నం ఒంటి గంటకు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి సమావేశం కానున్నారు. 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయసభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై కేసీఆర్.. ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్ పిలుపు ఇవ్వనున్నారు.
-ముఖ్యంగా తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తెలంగాణ ప్రజా వ్యతిరేక విధానాలను దనుమాడుతూ పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర నిరసనను ప్రకటిస్తూ, పార్లమెంటు వేదికగా పోరాటానికి పూనుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
-ఆర్ధికంగా క్రమశిక్షణను పాటిస్తూ అనతి కాలంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి, ఆర్థింకగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయాలని కేంద్రం కుటిల ప్రయత్నాలు చేస్తుండడం పట్ల తెలంగాణ ప్రజా ఆకాంక్షలను అద్దం పడుతూ ఉభయ సభల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించనున్నారు.
-వ్యవసాయం, సాగునీరు, తదితర వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యాచరణతో అనతికాలంలోనే అందరి అంచనాలను మించి, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే ముందంజలో తెలంగాణ నిలిచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా, రైతులను మిల్లర్లను ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల పై పోరాడాలని ఎంపీలకు, సీఎం పిలుపునివ్వనున్నారు.
-గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న తెలంగాణ విషయంలో కేంద్రం పొంతనలేని ద్వంద్వం వైఖరిని, దుర్మార్గ విధానాన్ని నిలదీయాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం గొప్పగా అమలు జరుగుతున్న తీరు గురించి, రాష్ట్రంలో జరుగుతున్న సోషల్ ఆడిట్ గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రశంసించింది, అవార్డులు ఇచ్చింది. కానీ, నేడు కేంద్ర ప్రభుత్వం మాట మార్చి విరుద్దంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నగ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేయాలనే కేంద్రం కుట్రపూరిత ధోరణుల పట్ల పార్లమెంటు వేదికగా నిలదీయాలని ఎంపీలకు సీఎం సూచించనున్నారు.
-ఇతర రంగాల్లోనే కాంకుడా ఆర్థిక రంగంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల, రోజు రోజుకూ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమౌతున్నదని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. క్షీణిస్తున్న రూపాయి విలువే అందుకు నిదర్శనంగా దేశ ప్రజలు భావిస్తున్నారు. దేశ అభివృద్ధి సూచి రోజు రోజుకూ పాతాళానికి చేరుకుంటున్న ప్రమాదకరపరిస్థితుల్లో దేశాన్ని ఆర్థిక సంక్షోభం భారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా తెలంగాణ ప్రజలకున్నదని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రజాభిప్రాయం ప్రతిబింబించేలా రూపాయి పతనం పై కేంద్రాన్ని ఉభయ సభల సాక్షిగా నిలదీయాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు సూచించనున్నారు.
-అదే సందర్భంలో… పాలనలోనే కాకుండా రాజకీయ, సామాజిక తదితర అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక ఆధిపత్య ధోరణి వల్ల దేశంలో రోజు రోజుకూ ప్రజాస్వామిక విలువలు దిగజారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో పరమత సహనం, శాంతి,సౌభ్రాతృత్వం ఫరిఢవిల్లాల్సిన దేశంలో అశాంతి ప్రబలే సూచనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రాజ్యాంగం పొందుపరిచిన ఫెడరల్ స్పూర్తికి, సెక్యులర్ జీవన విధానానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పార్లమెంటు వేదికగా దేశ ప్రజల ఆకాంక్షలను చాటేలా గొంతు విప్పాలని, టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
-కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటంలో భాగంగా, కలిసివచ్చే ఇతర రాష్ట్రాల విపక్ష ఎంపీలను కూడా కలుపుకుపోతూ, కేంద్రం మెడలు వంచి ప్రజాస్వామిక విలువలు కాపాడాల్సి వున్నదిని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు దేశ ప్రజల తరఫున టిఆర్ఎస్ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలను నిలదీస్తూ గళం విప్పాలని సీఎం కేసీఆర్ రేపటి సమావేశంలో ఎంపీలకు పిలుపునివ్వనున్నారు.