ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చాక మరోసారి ప్రతి ఇంటికీ భరోసాగా నిలువనున్నారు సీఎం కేసీఆర్. ‘కేసీఆర్ భరోసా’ పేరిట విడుదలైన మ్యానిఫెస్టో అమలైతే ప్రతి కుటుంబానికీ సగటున ఏటా అక్షరాలా లక్షన్నర రూపాయల ఆర్థిక సాయం నేరుగా అందనున్నది. ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, కేసీఆర్ జీవిత బీమా వంటి హామీలు వీటికి అదనం. గత మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 90 శాతానికిపైగా అమలు చేసి, మ్యానిఫెస్టోలో పెట్టని అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేసింది.
ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత అమలయ్యే పథకాలతో జరిగే లబ్ధిని ఒకసారి విశ్లేషిస్తే…మన ఊరికి అద్దం లాంటి రోడ్లు వచ్చినయి..అయితే ఏంటీ? ముసలోళ్లం మాకేం ఒరిగింది?ఆసరా పెన్షన్ రూ.2 వేలు వస్తున్నయి.మన పల్లె జలకళను సంతరించుకున్నది..అయితే, గృహిణినైన నాకేం లాభం జరిగింది?ఇంటికే నల్లా నీరు వస్తున్నది.
గ్రామాల్లోనూ 24 గంటల కరెంటు వస్తున్నది..
సరే, సర్లే.. రైతునైన నాకేం ప్రయోజనం?
ఎవుసానికి ఉచిత కరెంటు ఇస్తున్నరు..
ఎకరానికి రూ.10 వేల రైతుబంధు వస్తున్నది.
హరితహారంతో పల్లె పచ్చగా మారింది..
అయితే, అనాథలైన మాకేం జరిగింది?
రైతుబీమా రూ. 5 లక్షలు వచ్చినయి.
ఊరి చివరన వైకుంఠధామాలు వచ్చినయి..
సర్లే, గూడు లేని మాకేం జరిగింది?
డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది.
ఇదీ నిన్నటి వరకు…
ఆసరా పెన్షన్ పెంపు
వృద్ధులు, చేనేత, కల్లు గీత, బీడీ కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు అందించే ఆసరా పింఛన్‌ను క్రమంగా రూ.5,016కు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అంటే ఏడాదికి రూ.60,192 అందనున్నది. దివ్యాంగులుంటే అదనంగా రూ.12 వేలు అందుతాయి.
సౌభాగ్యలక్ష్మి
మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం అందనున్నది. మహిళలకు ఏటా రూ.36 వేలు అందుతాయి.
అన్నపూర్ణ
అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికీ సన్న బియ్యం సరఫరా చేస్తారు. ప్రస్తుతం సన్నబియ్యం ధర రూ.40 నుంచి రూ.60 వరకు ఉన్నది. ఒక కుటుంబానికి నెలకు 35 కిలోల బియ్యం అవసరమవుతాయనుకున్నా.. సగటున కిలో రూ.40 లెక్కన చూస్తే నెలకు బియ్యం కోసం చేస్తున్న ఖర్చు రూ.1,400. ఈ లెక్కన సంవత్సరానికి రూ.16,800 ఆదా అవుతాయి.
రైతుబంధు పెంపు
రైతుబంధు సాయాన్ని ఎకరానికి ఏడాదికీ రూ.16 వేలకు పెరుగుతుంది. ఒక కుటుంబానికి సగటున రెండు ఎకరాల పొలం ఉందనుకుంటే.. ఏటా రూ.32 వేలు అందుతుంది.
రూ.400కే గ్యాస్ సిలిండర్
వంటగ్యాస్ సిలిండర్ రూ.400కే వస్తుంది. ఇప్పుడు సిలిండర్ ధర రూ.వెయ్యికి పైనే ఉన్నది. అంటే ఒక్కో సిలిండర్‌పై రూ.600 సబ్సిడీ ఇవ్వనున్నారు. ఒక కుటుంబం ఏటా ఆరు సిలిండర్లు వాడితే.. రూ.3,600 సబ్సిడీ అందుతుంది.
ఇవన్నీ గణిస్తే ప్రభుత్వం ఏటా ఒక కుటుంబానికి అందించే ఆర్థిక సాయం అక్షరాలా.. రూ.1,48,592. దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామని చెప్పారు. కాబట్టి అదనంగా రూ.12 వేలు అందుతాయి. అనారోగ్యం పాలైతే రూ.15 లక్షల వరకు కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకం కింద ఉచితంగా చికిత్స పొందవచ్చు. కేసీఆర్ బీమాతో ఒకవేళ అనుకోని ఘటన జరిగి కుటుంబ పెద్ద కాలం చేస్తే రూ.5 లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
ఆసరా
రూ.60,192 : (దివ్యాంగులకు రూ.70,192)
సౌభాగ్యలక్ష్మి : రూ.36,000
రైతుబంధు : రూ.32,000
అన్నపూర్ణ : రూ.16,800
గ్యాస్ సబ్సిడీ : రూ.3,600
మొత్తం : రూ.1,48,592
(దివ్యాంగులు ఉంటే) : రూ.1,60,592)