CM KCR | ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. జోగులాంబ గద్వాల అలంపూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పాలనతో రూ.200 మొఖాన కొట్టి ఇదే పెన్షన్ అని చెప్పారు. కానీ, ఈ రోజు రూ.2వేలు ఇస్తున్నాం. రేపు మళ్లీ గెలిస్తే పెన్షన్ రూ.5వేలు చేస్తమని మనవి చేస్తున్నా’నన్నారు.
‘ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నరు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఏమంటున్నడంటే ప్రజలు కట్టే పన్నులన్నీ కేసీఆర్ రైతుబంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నడని మాట్లాడుతున్నడు. రైతుబంధు వేస్టా..? రైతుబంధు ఉండాలా..? రైతుబంధు కావాలంటే అలంపూర్‌లో విజయుడు గెలవాలి. ఆయనను గెలిపిస్తే రూ.10వేలుగా ఉన్న రైతుబంధును సంవత్సరానికి రేపు రూ.16వేలు చేస్తాం. పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నడు. కరెంటు కూడా వేస్ట్‌గా ఇస్తున్నడు 24 గంటలు. అవసరం లేదు. మూడు గంటలు సరిపోతది అంటున్నడు. మూడు గంటల కరెంటు సరిపోతుందా..? 24 గంటల కరెంటు ఉండాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. ఇక్కడ విజయుడు గెలిస్తేనే పైన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. మళ్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తది. మళ్లీ ఎవరి చేతులో ఏం ఉండదు. తర్వాత మళ్లీ మొదటికే వస్తుంది’ అంటూ హెచ్చరించారు.
‘ఇదే జిల్లాలో పుట్టిన పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నడు. మూడు గంటలకు పొలాలు ఎలా పారుతుందంటే.. రైతులు 10 హెచ్‌పీ మోటార్ పెట్టుకోవాలంటున్నడు. మరి రైతులదగ్గర 10 హెచ్‌పీ మోటర్ ఉంటదా? మరి మోటర్ పెట్టుకోవాలంటే డబ్బులు ఎవరు ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తయ్ ? ఎన్నివేల కోట్లు కావాలి. పదేళ్ల నుంచి మేం కష్టం చేసి పేదసాదలను ఆదుకుంటున్నాం. దళితబిడ్డల కోసం దళితబంధు కార్యక్రమం తీసుకువచ్చాం. దానివల్ల మంచి లాభాలు జరుగుతున్నయ్. అందరినీ ఆదుకుంటున్నాం. కంటి వెలుగు కార్యక్రమం పెట్టి ప్రతీ ఊరిలో కంటి పరీక్షలు చేయించి 80లక్షల మందికి అద్దాలు ఇచ్చాం. ఆడబిడ్డలకు ప్రసవిస్తే అమ్మ ఒడి వాహనాలు పెట్టాం. వారిని తీసుకెళ్లి ప్రసవం చేయించి.. ఇంటి వద్దనే దిగబెడుతున్నం. ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నయ్. ఇవన్నీ సదుపాయాలు కొనసాగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి’ అన్నారు.