నరమూర్తి కాదు కేవల
హరిమూర్తి గాదు మానవాకారము గే
సరి యాకారము నున్నది
హరి మాయారచితమగు యథార్థము చూడగన్
ఇందుగలడందులేడని సందేహము వలదన్నాడు ప్రహ్లాదుడు.. ఈ స్తంభంలో ఉన్నాడా? అని అడిగాడు హిరణ్యకశ్యపుడు. ఉన్నాడని జవాబిచ్చాడు ప్రహ్లాదుడు.. తన భక్తుడి మాటను నిలబెట్టడం కోసం నరసింహ రూపంలో స్తంభం నుంచి ఉద్భవించాడు నారాయణుడు. ఆ అవతారమే యాదాద్రి నారసింహుడు.
యాదాద్రి క్షేత్రం భవిష్యత్తులో జగద్విఖ్యాతి చెందుతుందని పరమశివుడు.. పార్వతీదేవికి చెప్పాడని యాదాద్రి క్షేత్ర మాహాత్మ్యంలో 231వ పుటలోని శ్లోకం చెప్తున్నది. ఆ దేవదేవుడు వెల్లడించిన మాట నిజమైనదో.. లేక యాదృచ్చికంగా జరిగిందో కానీ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో యాదాద్రి మహా వైభవమైన ఆలయంగా ఆవిష్కారమవుతున్నది. సోమవారం నుంచి గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తి భక్తజనావళిని అనుగ్రహించబోతున్నారు. మహాకుంభాభిషేకం అనంతరం స్వామివారి దివ్యదర్శనం లభించబోతున్నది. ఇది అపూర్వ క్షణం.. అత్యద్భుత సందర్భం.
ఉదయం 11.55 గంటలకు పవిత్ర జలాలతో మహా సంప్రోక్షణ
స్వయంభువుల తొలి పూజలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు
యాదాద్రి భువనగిరి, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో యాగ జలాలతో జరిగే సంప్రోక్షణలో మంత్రులతో పాటు ప్రముఖులు పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలవుతాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో శోభాయాత్ర నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేపడుతారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు సంప్రోక్షణ చేస్తారు. దివ్య విమానంపై శ్రీసుదర్శన స్వర్ణ చక్రానికి, ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులు సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఈ క్రతువులో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా పాల్గొంటారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రధానాలయంలోకి శోభాయాత్రగా వెళ్లి పంచనారసింహుడికి ఆరాధనలు జరుపుతారు. అనంతరం స్వయంభువుల దర్శనాలకు అనుమతి ఇస్తారు. బాలాలయంలో 2016 ఏప్రిల్ 21 నుంచి ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు కొనసాగుతుండగా, ఆదివారం రాత్రి నుంచే బాలాలయంలో దర్శనాలకు తెరపడింది.
నలుమూలలా ఆధ్యాత్మికం
ఆలయం చుట్టుపక్కల ఎటుచూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రారంభోత్సవ వేడుకలకు వచ్చే భక్త జనులకు స్వాగతం పలకడానికి, యాదాద్రి వైభవాన్ని చాటేందుకు హైదరాబాద్ నుంచి యాదాద్రి పట్టణం వరకు రహదారులపై, యాదాద్రికి చుట్టూ నిర్మించిన రింగ్ రోడ్డు మీదుగా ఆలయానికి వచ్చేదారుల్లో భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయ గోపురాలు, మండప ప్రాకారాలు, మాడ వీధులు.. ఇలా అన్నింటినీ పూలతో అలంకరించారు. ఏడు వర్ణాలలో చేపట్టిన విద్యుత్తు కాంతుల్లో ఆయా నిర్మాణాలు రాత్రివేళ నేత్రపర్వంగా కన్పిస్తున్నాయి. క్షేత్రం యావత్తు పచ్చందాలతో కనువిందు చేసేలా గ్రీనరీని అభివృద్ధి చేశారు. వీవీఐపీలు కొండపైకి వెళ్లేందుకు నిర్మించిన మూడో ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. భక్తులను కొండపైకి చేర్చడానికి ‘యాదాద్రి దర్శిని’ పేరుతో ఆర్టీసీ బస్సులను తీర్చిదిద్దారు. ‘యాదాద్రి జలప్రసాదం’ పేరుతో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. భక్తుల దర్శనాలకు సంబంధించి ఆన్లైన్ బుకింగ్ సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నది. విష్ణు పుష్కరిణి, లక్ష్మీ పుష్కరిణిని సోమవారం ఉదయం ప్రారంభిస్తారు. దీక్షాపరుల మండపాన్ని కూడా ప్రారంభించి, అందులోనే భక్తులకు అన్నదానం నిర్వహించనున్నారు.
సీఎంతోపాటు వీవీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు
మహాకుంభ సంప్రోక్షణకు వచ్చే వీఐపీలు, వీవీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబం, మంత్రులకు ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను వసతి కోసం సిద్ధం చేసి ఉంచారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర వీఐపీలకు మున్నూరుకాపు సంఘం, రెడ్డి సత్రం, గౌడ సంఘం, వంజర సత్రం, తులసి కాటేజ్‌లలో వసతి ఏర్పాట్లు చేశారు. వీవీఐపీల వాహనాలకు కొండ కిందనే పార్కింగ్ ఉన్నది. అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు. వీఐపీలు, ప్రముఖులను కొండపైకి చేర్చేందుకు వోల్వో బస్సులను సిద్ధం చేసి ఉంచారు.
3 వేల మంది పోలీసుల పహారా
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): యాదాద్రి అణువణువూ నారసింహుడి జపం చేస్తుంటే.. అడుగడుగునా పోలీసులు భక్తులకు భద్రత కల్పిస్తున్నారు. దాదాపు 3 వేల మంది పోలీసులు యాదాద్రి చుట్టూ పహారా కాస్తున్నారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ సిబ్బందిని కూడా మోహరించారు. సోమవారం నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభు పునర్దర్శనం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. కమాండ్ క్రంటోల్ కేంద్రంలో మూడు షిఫ్టుల్లో మొత్తం 20 మందికి పైగా సిబ్బంది 24/7 భద్రతను పర్యవేక్షిస్తున్నారు. దీనికి తోడు డ్రోన్ పెట్రోలింగ్‌ను కూడా నిర్వహిస్తున్నారు.
కన్నులపండువగా పంచశయ్యాధివాసం
పాంచరాత్ర ఆగమ విధానాలతో ఆదివారం మహాయాగ క్రతువు, ప్రధానాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం, షోడశ కళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం కన్నులపండువగా జరిగాయి. శాస్ర్తోక్తంగా 108 కలశములతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. కలశాల్లో పవిత్ర జలాలు, పంచామృతం, సుగంధ ద్రవ్యాలను నింపి సుదర్శన చక్రం, పెరుమాళ్లు, గోదాదేవి, గరుడ, విష్వక్సేన, ప్రతిష్ఠామూర్తులను అభిషేకించారు. ప్రధానాలయంలో షోడశకళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం పర్వాలను నిర్వహించినట్టు ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థిఘల్ లక్ష్మీనర్సింహాచార్యులు తెలిపారు. బాలాలయంలో వేద మంత్రాలు, సామూహిక విష్ణు సహస్రనామ పఠనం కొనసాగింది. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఆలయ ఈవో ఎన్ గీత పాల్గొన్నారు. సోమవారం ఉదయం నిర్వహించే నిత్య హోమం, చతుస్థానార్చన, పరివార శాంతి ప్రాయశ్చిత్త హోమం, శాలబలితో హోమక్రతువు ముగుస్తుంది.
నేటి కార్యక్రమాలు
ఉదయం 7.30 గంటల నుంచి: నిత్య హోమాలు, చతుస్థానార్చన, పరివార శాంతి ప్రాయశ్చిత్త హోమం, శాలబలి
ఉదయం 9 గంటలకు: మహాపూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, మిథున లగ్న పుష్కరాంశమున గర్తవ్యాసము, రత్నవ్యాసము, యంత్ర ప్రతిష్ఠ, బింబ ప్రతిష్ఠ, అష్టబంధనం, కళారోహణం, ప్రాణ ప్రతిష్ఠ, నేతోన్మీలనం, దిష్టికుంభం.
ఉదయం 10 గంటలకు: బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర
మధ్యాహ్నం 11.55 గంటలకు: మిథునలగ్న సుముహూర్తాన మహా కుంభాభిషేకం, ప్రథమ ఆరాధన, ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్టి
సాయంత్రం 6 గంటలకు: శాంతి కల్యాణం, ఆచార్య రుత్విక్ సన్మానం, మహాదాశీర్వచనం.
ప్రపంచంలోనే ప్రత్యేక ం: కవిత
యాదాద్రి నృసింహుడి నిజరూప దర్శనం సోమవారం నుంచి కలగనున్న నేపథ్యంలో.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వర్ణకాంతుల్లో వెలిగిపోతున్న ఆలయ ఫొటోలను ట్వీట్ చేశారు. ‘ అద్భుతమైన శిల్పకళతో రూపుదిద్దుకున్న యాదాద్రి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది. యాదాద్రి ఆలయానికి సంబంధించి ప్రతి ఒక్కటీ విశిష్టమైనదే. మన అందమైన రాష్ర్టానికి అత్యంత చారిత్రక, ఐకానిక్ దేవాలయాల్లో ఒకటిగా యాదాద్రిని అందించిన సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు సహకారంతో ఎనుగొండ లక్ష్మీనరసింహారెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన ‘శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి నమామి.. భక్తజన గుండెల్లో సదా నీ పేరే స్మరామి’ అనే వీడియో పాటను మంత్రి ఆదివారం హైదారాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆవిషరించారు. ఈ పాటను రూపొందించిన లక్ష్మీనరసింహారెడ్డి బృందాన్ని మంత్రి అభినందించారు.
– హైదరాబాద్
యాదాద్రి శిల్పకళా వైభవం
రామచంద్రుడు తాక రాయి రమణిగా మారె..
శిల్పి చేయి తగిలి శ్రీహరాయెను శిలలు..
రాగాలు పలికేటి రామప్ప శిల్పాలు..
వేల వేళ్లు చెక్కె వేయి స్తంభాలను..
ఉలి తగలగానె శిలలూపిరోసుకునెను..
కఠిన శిల సైతమూ కదిలే ప్రాణాలతో..
తొలి దెబ్బకే శిలలు తోరణాలయ్యాయి..
మలి దెబ్బకే శిలలు మండపాలయ్యాయి..
కోటి దెబ్బలు తిని కోవెలాయెను కొండ..
లక్ష్మీ నరసింహుడే కొలువాయె కోవెలలో..
యాదాద్రి జక్కన్నలు చెక్కగా చక్కగా..
శిలను శిల్పము చేసి చరితనిల్చెను శిల్పి..
విశ్వకర్మ సైతమూ విస్తుపోయే విధము..
ప్రతి యాదాద్రి శిల్పమొక
వేదం..నాదం..మోదం..మోక్షం..
చరితార్థమగును సీఎం చంద్రశేఖరుని స్ఫూర్తి..
అజరామరమై వెలుగు
యాదాద్రి శిల్పుల కీర్తి…
డాక్టర్ వంగ చక్రపాణి
9849558058