హైదరాబాద్/సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): లష్కర్ బోనాలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, శోభ దంపతులు స్వయంగా పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులకు పూజారులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎండోమెంట్స్ కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు
డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఆహ్వా నం మేరకు సీఎం కేసీఆర్ దంపతులు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారు. పద్మారావుగౌడ్ నివాసంలోని ముత్యాలమ్మ గుడిలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజన ఆతిథ్యాన్ని స్వీకరించారు.
అమ్మవారికి బోనం సమర్పించిన ప్రముఖులు
మహంకాళి జాతరను పురస్కరించుకొని అమ్మవారికి పలువురు ప్రముఖులు బోనం సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఉదయం 4 గంటలకు మొదటి బోనం సమర్పించారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు అమ్మవారికి బోనం సమర్పించా రు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంగారు బోనంతో అమ్మవారి ఆలయానికి తరలివెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నవారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, పద్మాదేవేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేశ్, దాసోజు శ్రవణ్‌కుమార్, మర్రి శశిధర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తదితరులు ఉన్నారు. సోమవారం ఉదయం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రంగం కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ పాలక మండలి తెలిపింది.