మహబూబాబాద్/ భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట లభించేలా రాష్ట్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే 14 జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కార్యకలాపాలు మొదలుపెట్టగా, నేడు మరో రెండు కలెక్టరేట్లు ప్రారంభం కానున్నాయి. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. ఉదయం మానుకోటలో కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం.. మధ్యాహ్నం కొత్తగూడేనికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తన పర్యటనలోభాగంగా మహబూబాబాద్, కొత్తగూడెంలలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు.
ఇప్పటికే 14 జిల్లాల్లో ప్రారంభమైన కలెక్టరేట్లు
అధికార వికేంద్రీకరణకుతోడు పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రభుత్వం 10 ఉమ్మడి జిల్లాలను 33 జిల్లాలుగా మార్చింది. కొత్త జిల్లాలతోపాటు, పాత జిల్లా కేంద్రాల్లోనూ ప్రభుత్వ శాఖల సేవలన్నీ ఒకే గొడుగు కింద లభించేలా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయాల నిర్మాణాన్ని చేపట్టింది. 29 జిల్లాల్లో రూ.1581.62 కోట్లతో కలెక్టరేట్ల నిర్మాణం మొదలుపెట్టింది. ఇప్పటికే 14 జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు ప్రారంభమవగా.. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ సముదాయాలు నేడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.
తొలుత మానుకోటకు..
తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన పోరాట కేంద్రం మానుకోట. నాడు ఉద్యమసారథిగా పలుమార్లు మహబూబాబాద్‌లో పర్యటించిన కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలో గురువారం మరోమారు అక్కడ పర్యటించనున్నారు. ఉదయం 9.45 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా మానుకోటకు చేరుకోనున్న సీఎం కేసీఆర్.. అక్కడ నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మహబూబాబాద్ సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించి, పరిశీలించనున్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో 10 వేల మందితో నిర్వహించనున్న సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు.
తర్వాత అధికారయంత్రాంగం, ప్రజాప్రతినిధులతో మహబూబాబాద్ జిల్లా ప్రగతిపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటనకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయగా, అధినేతకు ఘనస్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సైతం సిద్ధమయ్యాయి. స్వాగత తోరణాలతో మానుకోట పట్టణం గులాబీమయమైంది. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు.
కొత్తగూడేనికి కొత్త ఊపు
గురువారం కొత్తగూడెం పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండున్నర గంటలపాటు పట్టణంలో పర్యటించనున్నారు. సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించి, పరిశీలించనున్నారు. 10 వేలమంది హాజరవనున్న సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అనంతరం పట్టణంలోని ఎల్ఐసీ ఆఫీసు పక్కన నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అక్కడినుంచి ప్రకాశం స్టేడియం చేరుకుని హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ బయల్దేరతారు. కలెక్టరేట్ ఆవరణలోనే హెలిప్యాడ్‌ను అధికారులు సిద్ధం చేశారు. కాన్వాయ్ ట్రయల్న్‌న్రు పోలీసులు పరిశీలించారు. సీఎం పర్యటన కోసం కొత్తగూడెం పట్టణం ముస్తాబైంది. ప్రభుత్వ విప్, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ ఏర్పాట్లను పరిశీలించారు. స్వాగత తోరణాలతో పట్టణం గులాబీమయమైంది.
నేడు సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్..