CM KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన 9 మెడికల్ కాలేజీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో గురువారం వైద్యారోగ్యశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతోపాటు విద్యార్థులకు వైద్యవిద్యను చేరువ చేసేందుకు ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్‌రావు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, అందులో మూడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకుముందే ఉన్నాయని పేర్కొన్నారు. తాజాగా ప్రారంభించే 9 మెడికల్ కాలేజీలు కలుపుకొని రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరుతుందని తెలిపారు. కొత్తగా 900 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 3,915కు చేరిందని వివరించారు. నిరుడు ఒకేసారి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించినట్టు గుర్తు చేశారు. 15 న మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం మరోసారి సమావేశమై ఏర్పాట్లు పర్యవేక్షించాలని కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డిని మంత్రి ఆదేశించారు.
కొత్తగా 100 ఆరోగ్య మహిళ కేంద్రాలు
మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘అరోగ్య మహిళ కేం ద్రాల’ను విస్తరించనున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 272 కేంద్రాలు ఉండగా, కొత్తగా ఏర్పాటు చేస్తున్న 100 కేంద్రాను 12వ తేదీన ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీటితో కులుపుకుని ఆరోగ్య మహిళ కేంద్రాల సంఖ్య 372కు పెరుగుతుందని వివరించారు. ఈ కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ, 8 రకాల ప్రధాన వైద్య సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆరోగ్య మహిళ ద్వారా ఇప్పటివరకు 2,78,317 మందికి స్రీనింగ్ నిర్వహించినట్టు తెలిపారు.
అవసరం ఉన్న 13,673 మందిని పై దవాఖానలకు రెఫర్ చేశారని పేర్కొన్నారు. 5,204 స్టాఫ్‌నర్స్ రిక్రూట్మెంట్ ఫలితాలు త్వరగా విడుదల చేయాలని ఆదేశించారు. ఏఎన్ఎంల పీఆర్సీ, ఎరియర్స్ వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా మంజూరు చేసిన ఐదు డీఎంహెచ్‌వోల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్‌రావు, ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ దవాఖాన డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.
తరగతులు ప్రారంభమవుతున్న కాలేజీలు: