హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నేడు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కామారెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.అనంతరం కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని, మాట్లాడుతారు. కామారెడ్డి బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తెలంగాణ బ్రిగేడియర్ కోసం కామారెడ్డి ఎదురుచూపు
ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తమ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారనే విషయం తెలిసినప్పటి నుంచి కామారెడ్డి ప్రజలు ఉరకలెత్తే ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ‘సార్ వస్తే మా బతుకులు బాగుపడుతాయి. మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది’ అని ప్రజలు సంబురపడుతున్నారు. ఉద్యమ నిర్మాణంలో నాటి ఉద్యమరథ సారథి, సీఎం కేసీఆర్ కామారెడ్డి బ్రిగేడియర్‌గా వ్యవహరించారు. తెలంగాణవ్యాప్తంగా ఉద్యమవ్యాప్తికి దోహదపడేందుకు పార్టీ నిర్మాణం కీలకమని భావించి ప్రతి మండలానికి ఒక బ్రిగేడియర్‌ను నియమించారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ కామారెడ్డి మండలానికి బ్రిగేడియర్‌గా బాధ్యతలు స్వీకరించి, మండలంలోనే రెండు రోజులు బసచేశారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు ఆయనే దగ్గరుండి మరీ పార్టీ గ్రామ కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలు వేశారు. ఉద్యమ నిర్మాణంలో భాగంగా బహిరంగ సభల నిర్వహణ కోసం నిధులు సమకూర్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత మొదలు అన్నిస్థాయిల కార్యకర్తలు కూలిపని కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ చరిత్రలో కూలిపని ద్వారా నిధులు సమకూర్చుకోవాలనే విధానాన్ని ప్రవేశపెట్టిన రాజకీయ పార్టీగా బీఆర్ఎస్, అధినేతగా సీఎం కేసీఆర్ రికార్డు నెలకొల్పారు.
నామినేషన్‌కు అంబులెన్స్‌లో రానున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి
ఇటీవల కత్తిపోట్ల గురై హైదరాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో గురువారం హైదరాబాద్ నుంచి నేరుగా దుబ్బాక రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొని తన నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావుతోపాటు దుబ్బాక నియోజకవర్గం నుంచి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు తరలిరానున్నారు. ప్రభాకర్‌రెడ్డి సతీమణి మంజులత వారి కుటుంబసభ్యులు నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో బుధవారం నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.