2001.. వేదిక: కరీంనగర్..
టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన సింహగర్జన సభ. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన రణన్నినా దం.. మాటల మరఫిరంగులై మోగిన సభ. మరో పోరాటానికి తెలంగాణ నేలను సంసిద్ధం చేసి, స్వరాష్ట్ర ఆకాంక్షను యావత్తు దేశానికి ఎలుగెత్తి చాటిన సభ. అప్పటి జేఎంఎం అధినేత శిబూసోరెన్ స్వయంగా వచ్చి.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించిన సందర్భం.
2023 జనవరి 18, వేదిక: ఖమ్మం
టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత జరుగనున్న తొలి బహిరంగ సభ. దేశగతిని మార్చేందుకు, ప్రజల దుర్గతిని మాపేందుకు ఉద్యమ పథగామి కేసీఆర్ కదన శంఖారావం పూరించనున్న సభ. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న సభ. మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, విపక్ష పార్టీల జాతీయ నేతలు తరలివచ్చి సంఘీభావాన్ని ప్రకటించనునున్న చారిత్రక వేదిక.
అప్పుడూ, ఇప్పుడూ రెండింటిలోనూ ఉద్యమ సారథి కేసీఆరే..నాడూ నేడూ ఢిల్లీ గద్దె గుండెల్లో అదే దడ.. అప్పటికీ ఇప్పటికీ ప్రజల్లో మాత్రం గులాబీ జెండాపై అదే అచంచల విశ్వాసం..
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఖమ్మం గుమ్మం నుంచే భారత నగారా మోగనున్నది. తెలంగాణ ఉద్యమం మొదలైనచోటు నుంచే దేశ గుణాత్మక మార్పునకు భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమరశంఖం పూరించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత తొలిసారిగా ఈ నెల 18న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. జాతీయపార్టీ బీఆర్ఎస్ ఎజెండాను ఈ సభ ద్వారా ప్రజలకు వివరించడంతోపాటు.. దేశంలో జరుగుతున్న కుత్సిత రాజకీయ కుతంత్రాలపై అధినేత కేసీఆర్ రణన్నినాదం చేయనున్నారు.
ఈ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం సహా దేశం నలుమూలల నుంచి రైతుసంఘాల ప్రతినిధులు, వివిధ రంగాల నిపుణులు హాజరుకానున్నారు. కేరళ సీఎం పినరాయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సహా పలువురు జాతీయ నేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో ఏ జిల్లాకు రాని అవకాశం తమకు వచ్చిందనే సంతోషంతోపాటు, ఈ బహిరంగసభను విజయవంతం చేయాలనే పట్టుదలతో ఖమ్మం ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఉన్నారు.
సీఎం కేసీఆర్‌కు ఖమ్మం నేతల కృతజ్ఞతలు
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించిన తరువాత తొలి బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించడంపై ఖమ్మం జిల్లా నాయకుల ఆనందం అంతా ఇంతా కాదు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, గులాబీ పార్టీ కీలక నేతలు సోమవారం ప్రగతిభవన్‌లో అధినేత కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలు, ఖమ్మం నాయకులతో సమావేశమైన కేసీఆర్.. బహిరంగసభ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధు, ఎమ్మెల్యేలు హరిప్రియ, రేగా కాంతారావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములు నాయక్, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
తెలంగాణలో జరగనున్న మొట్టమొదటి బీఆర్ఎస్ సభను విజయం చేసేందుకు అధినేత సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నేతలకు పలు సూచనలు చేశారు. దేశ నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు, మేధావులు అధిక సంఖ్యలో హాజరవనున్న ఈ సభకు ఏర్పాట్లు కూడా గొప్పగా ఉండేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. దేశవ్యాప్తంగా అందరి చూపు ఖమ్మం సభపై ఉంటుందని, ఈ నేపథ్యంలో ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.
బహిరంగ సభావేదికను విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని సూచించారు. సభకు వచ్చేవారికి అన్ని సౌకర్యాలు సమకూరేలా చూడాలని, స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజల కోసం మంచినీటి వసతి కల్పించాలని చెప్పారు. ఖమ్మం సరిహద్దు జిల్లాలైన నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచీ భారీఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా ఖమ్మం నేతలు సీఎం కేసీఆర్‌కు హామీ ఇచ్చారు.
నాడు సింహగర్జన…నేడు భారతగర్జన
2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కరీంనగర్లో నిర్వహించిన సింహగర్జన బహిరంగసభ స్వరాష్ట్ర ఆకాంక్షను ఏ స్థాయిలో ప్రతిబింబించిందో.. అదే రీతిలో ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగసభ ‘భారతగర్జన’ తీవ్రతకు ప్రతిరూపంగా నిలవాలనే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా స్పష్టమవుతున్నది. తెలంగాణ సింహగర్జన సభకు అప్పటి జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ సీఎం శిబూసొరేన్ హాజరై, గులాబీ దళపతి కేసీఆర్‌కు ఎలా సంఘీభావం పలికారో.. అదేరీతిలో మెరుగైన భారత నిర్మాణానికి బయలుదేరిన సీఎం కేసీఆర్‌కు తొలి బహిరంగ సభకు ముగ్గురు సీఎంలు, మాజీ సీఎంలు, పలువురు జాతీయ నేతలు అండగా నిలిచారనే స్పష్టమైన సంకేతాన్ని బీఆర్ఎస్ నిర్వహించే ఖమ్మం బహిరంగ సభ ఇవ్వనున్నది.
మన దేశంలో రాజకీయాలు ఒక పార్టీ గెలుపు.. మరో పార్టీ ఓటమి అన్నట్టుగానే సాగుతున్నాయి. గెలువాల్సింది ప్రజలే కానీ.. పార్టీలు కాదు. ప్రజలు గెలిచే పంథాను రాజకీయ పార్టీలు అనుసరించాలి. అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయాలంటే ఒక ఆట లాంటిది. బీఆర్ఎస్కు మాత్రం అదొక టాస్క్, యజ్ఞం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మా అభిమతం. అందుకే అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగాం.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా విజయ తీరాలకు తీసుకెళ్లామో.. దేశాన్ని కూడా విజయాల వైపు నడిపించుకొందాం. తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసుకొన్నమో.. దేశాన్ని కూడా అభివృద్ధి చేసుకొందాం. తెలంగాణ ప్రజలను ఎట్లా అయితే గెలిపించుకొన్నమో..దేశ ప్రజలను కూడా గెలిపించుకొందాం.
-బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్
కేసీఆర్ పర్యటనకు చకచకా ఏర్పాట్లు
సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేసీఆర్ ఈ నెల 12న భదాద్రి కొత్తగూడెం, 18న ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు కావడంతో ఏర్పాట్లపై అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఈ మేరకు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వినీత్ భద్రతాంశాలను సమీక్షిస్తున్నారు. సమీకృత కలెక్టరేట్లను, సభా స్థలాలను పరిశీలించారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 3 రోజుల్లోగా కలెకర్ కార్యాలయానికి సంబంధించిన అన్ని పనులూ పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులకు సమీకృత కలెక్టరేట్లోనే భోజనాలు ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
నేటి నుంచి విధుల్లోకి కలెక్టర్
వ్యక్తిగత కారణాలతో ఈనెల 16 వరకు సెలవుపై వెళ్లిన ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మంగళవారం నుంచి విధుల్లోకి రానున్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల భవన ప్రారంభోత్సవానికి ప్రభుత్వం ఈనెల 18వ తేదీని అధికారంగా ఖరారు చేయడంతో కలెక్టర్ తన సెలవును రద్దు చేసుకొని విధుల్లో చేరనున్నారు. ఖమ్మం నూతన కలెక్టరేట్ పక్కనే 100 ఎకరాల స్థలంలో నిర్వహించే బహిరంగ సభా స్థలాన్ని, ఇతర ఏర్పాట్లను అదనపు డీసీపీ సుభాశ్ చంద్రబోస్, మంత్రి అజయ్ పీఏ రవికిరణ్ తదితరులు సోమవారం పరిశీలించారు.