T Congress | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు మూడు నెలల ముందుగానే సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని తీర్మానం చేసిన కాంగ్రెస్ పత్తాలేకుండా పోగా, బీజేపీలోనూ ఇప్పటివరకు అభ్యర్థుల ఊసే లేదు. ఏ రాష్ట్రం లో ఎన్నికలు జరిగినా ఆరు నెలలు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని నిరుడు జరిగిన చింతన్ శిబిర్‌లో అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్మానించింది.
మూడు నెలల ముందు కూడా అభ్యర్థులను ప్రకటించలేని దీనస్థితిలో కూరుకుపోయింది. రాష్ట్రంలో నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా, ఇప్పటికీ టికెట్ల ఊసే లేదు. రెండు రోజుల క్రితమే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత వాటిని పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేసేసరికి పుణ్యకాలం గడిచిపోయేలా ఉందని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. 119 స్థానాల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తమ పార్టీలో సరైన అభ్యర్థులు లేకపోవడంపై ‘పక్క’ చూపులు కూడా చూస్తున్నట్టు తెలుస్తున్నది.