CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కానీ, వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందిందని సీఎం తెలిపారు. తద్వారా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండిందన్నారు. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం, సంస్థ ప్రయోజనాలు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడాదికి రూ. 1500 కోట్లను ప్రభుత్వమే బడ్జెట్లో అందిస్తూ వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంస్కరణల ఫలితంగానే ఆర్టీసీ సంస్థ గతంలో కంటే ఇప్పుడు కొంత మెరుగైన ఫలితాలను సాధించగలుగుతోంది. కానీ, నష్టాలు మాత్రం తప్పడంలేదు. అయినా ఆర్టీసీ సంస్థను కాపాడాలి, అందులో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం చూడాలనే లక్ష్యంతో 43, 373 మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బిల్లు అసెంబ్లీలో కూడా ఆమోదం పొందిందని కేసీఆర్ తెలిపారు.