‘తెలంగాణ తెచ్చిన పేరే నాకు ఆకాశమంత పెద్దది! దాన్ని మించింది ఉన్నదా?
అయినా మీరు మన్నించి ఇచ్చిండ్రు కాబట్టి రెండుసార్లు సీఎంగా చేసిన. పదేండ్లాయె.
నేను కొట్లాడేది ఇవ్వాళ పదవి కోసం కాదు. వందశాతంపేదరికం లేని తెలంగాణ కావాలి. అదీ నా పంతం. రైతాంగం గుండెమీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోయేలా బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. అది నా స్వప్నం. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. కేరళ రాష్ట్రం మాదిరిగా వందశాతం అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం కావాలి. ఇది నా కల
– జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. చైతన్యనేల జగిత్యాలలో మాట్లాడుతూ.. నాటి ఉద్యమ దృశ్యాన్ని ఒక్కసారి మననం చేసుకున్నారు. పోరాట పథాన్ని ప్రస్తావించారు. ఎట్లుండె తెలంగాణ..? కనబడని దారి! కమ్ముకున్న చీకటి! నీళ్లు లేని పల్లెలు! ఏడ్వడానికీ కన్నీరింకిన రోజులు! కేసీఆర్ మాటల్లో కండ్లముందు కనిపించినయ్. ‘58 ఏండ్లు గొడగొడ ఏడ్చింది తెలంగాణ. మంచినీళ్లు లేవు. సాగునీళ్లు లేవు. కరెంటు సక్కగరాదు. దుబాయికి వలసబోయిన బతుకులు. చేనేతల కార్మికుల ఆకలిచావులు, రైతులు ఉరిపోసుకుని సచ్చుడు.. ఎంతటి భయంకరమైన పరిస్థితులవి’. నిజమే! ఎంత దుఃఖపడ్డది
తెలంగాణ? ఎంతగా దగాపడ్డది? చెల్లాచెదురైన తెలంగాణను ఒక్కతాటిపైకి తెచ్చిండు కేసీఆర్. చీలికపేలికలైన సబ్బండవర్ణాలను ఐక్యం చేసిండు. మట్టినీ, మింటినీ ఏకం చేసిండు. గల్లీ గల్లీని నడిపించి.. ఢిల్లీని కదిలించిండు. ‘తెలంగాణ కోసం బొంతపురుగునైనా కౌగలించుకుంటా’అని లెఫ్ట్, రైట్, సెంటర్ అన్నింటినీ కలిసిండు. ‘ఉద్యమబాట వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి’ అని ప్రకటించి అదే మాట మీద నడిచి, గెలిచిన మొనగాడు కేసీఆర్. జనం విశ్వసించారు. వెంటనడిచారు.
అప్పటికీ, ఇప్పటికీ కేసీఆర్ ఆత్మ తెలంగాణ! నాటికీ, నేటికీ తెలంగాణ ఆత్మ.. కేసీఆర్!ఇప్పుడెట్లా అయ్యింది తెలంగాణ..? సాధకుడే పాలకుడైతే పదేండ్లలో బంగారపు తునకైంది రాష్ట్రం! అస్తిత్వంకోసం పోరాడిన తెలంగాణ.. నేడు అభివృద్ధితో, ఆత్మగౌరవంతో మెరుస్తున్నది. గడిచిన రోజుల్ని మరువొద్దు. నడిచిన దారినీ మరువొద్దు. ఎన్నికల ప్రచారంలో ‘మాకు ఓటేయండి’ అని అడిగే నేతల్ని చూశాంగానీ, ‘ఆలోచించి ఓటేయండి’ అనే నాయకుడు కేసీఆర్. ఆయనకిష్టమైన కాళోజీ కూడా చెప్పిందదే.. ఓటిచ్చునప్పుడే ఉండాలె బుద్ధిఎన్నుకొని తలబాదుకున్న ఏమగును?తర్వాత ఏడ్చినను తప్పదనుభవము’కేసీఆర్ కూడా ప్రతిరోజూ అదే చెప్తున్నారు. ‘ప్రజల్ని నేను కోరేది ఒక్కటే. పార్టీల వైఖరి, నాయకుల సరళి అన్నీ ఆలోచించి ఓట్లేయాలె. ఆగం కావొద్దు! రాష్ర్టాన్ని ఆగం చేయొద్దు’! అని కోరుతున్నారు. తెలంగాణమా ఆలోచించు!
‘ఈ పార్టీలకు వాడే మొగుడు : కాళోజీ
తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టకముందు కేసీఆర్ హన్మకొండలోని ప్రజాకవి కాళోజీ ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కాళోజీ ఇంటికి కేసీఆర్ వచ్చి వెళ్లిన తరువాత అప్పుడున్న రాజకీయ నాయకులు, తెలంగాణ కోసం పనిచేస్తున్నామనే కొంతమంది కాళోజీతో.. ‘మీరు ఎవరు పడితే వారికి ఆశీర్వచనాలు ఇస్తున్నారు. కానీ, ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ అవసరమా? ఇప్పుడున్న పార్టీలతో సాధ్యం కానిది ఇక ఈయన (కేసీఆర్)తోటి అవుతుందా?’ అని అడుగబోతుండగా వారిని కాళోజీ వారించారు. ‘అరేయ్..మీకు చాతనైతే చేయండి. లేకపోతే ఊరుకోండి. నడిచేవాని కాళ్లల్లో కట్టెలు పెట్టకండి. మీరు చెప్తున్న పార్టీలన్నింటికీ ఒక హైకమాండ్ ఉంది. కానీ, వాడికి వాడే. ఈ పార్టీలకు వాడే మొగుడు’ అని ప్రజాకవి కాళోజీ నిష్కర్షగా వారిని వారించారు.
తెలంగాణ ప్రయాణంలో.. దిక్కులు పిక్కటిల్లే నినాదం అతడు!
తెలంగాణ తల్లి చెర విడిపించడం కోసం జైలుకు వెళ్లడానికి సైతం సిద్ధపడ్డాడు కేసీఆర్. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదని, ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని 29-10-2009 నాడు ఇందిరాపార్కు వద్ద జైల్ భరో కార్యక్రమం చేపట్టారు. ఆ సందర్భంగా పోలీసులు ఆయనను అరెస్టు చేసిన దృశ్యం. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ మొత్తం జోనల్ విధానాన్నే సమూలంగా మార్చివేశారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా రాజ్యాంగ సవరణ చేయించారు.
దశాబ్దాల రోగాన్ని కుదిర్చిన వైద్యుడతడు!
ఫ్లోరోసిస్ వ్యాధితో ముప్పుతిప్పలు పడుతున్న నల్లగొండలో కేసీఆర్ పోరు జెండా ఎత్తారు. ఈ అవిటితనాన్ని రూపుమాపాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన తప్ప మరోమార్గం లేదని ఉద్ఘాటించారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ యాత్ర జరిపారు. మర్రిగూడలోని ఫ్లోరోసిస్ కార్యాలయాన్ని సందర్శించి బాధితులతో దాదాపు మూడుగంటలపాటు ఉండి, వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నల్లగొండ నుంచి ఫ్లోరిసిస్ వ్యాధిని పారదోలారు.
తెలంగాణే ఊపిరిగా బతికే వినయ విధేయుడతడు!
తెలంగాణ రాష్ట్రం తేవడానికి ఉద్యమించిన క్రమంలో మూడు కోట్ల మంది ప్రజలతో పాటు తెలంగాణ స్వరాల, సిద్ధాంతాల ఆశీస్సులను సైతం అందుకున్నడు కేసీఆర్. ఆయా సందర్భాల్లో ప్రజాకవి కాళోజీ, ప్రొ. జయశంకర్ సార్ కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకున్నారు. నాటి నుంచి నేటి దాకా తెలంగాణ భాష, యాస, సంస్కృతీ సంప్రదాయల పట్ల ఆయన ఆరాధనా భావం, తెలంగాణ పట్ల ఆయన కమిట్మెంట్ చెక్కుచెదరలేదు.
అడవి బిడ్డల సంక్షేమానికి ఆద్యుడతడు!
ఉద్యమ కాలంలో గిరిజన హక్కుల కోసం కేసీఆర్ గళమెత్తి తండాబాట పట్టారు. వరంగల్ జిల్లాలో దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న నిరుపేద గిరిజనుల్ని కలిసి వారి కష్టసుఖాల్ని ఆరాతీరారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజన తండాలన్నింటినీ గ్రామపంచాయితీలుగా మార్చారు. వారికి రిజర్వేషన్ శాతాన్ని పెంచారు. గిరిజనులు సాగుచేసుకునే పోడు భూములకు పట్టాలిచ్చి రైతుబంధు అందించారు.
తనబిడ్డలు చల్లగ బతకాలని తపించే తండ్రి అతడు!
తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్, తనకెంతో ప్రియమైన తెలంగాణ బిడ్డలు, యువతీయువకులు ప్రాణాలు బలిపెడితే కన్నీరు మున్నీరై విలపించారు. ఉస్మానియా వర్సిటీలో వేణుగోపాల్‌రెడ్డి ఆత్మ బలిదానం చేసినప్పుడు కేసీఆర్ వెక్కి వెక్కి ఏడ్చారు. ‘మీకు దండం పెడతా.. మీరు ప్రాణాలు తీసుకోవద్దు. మీ కోసం నేను పోరాడుతా.. అవసరమైతే ప్రాణాలిస్తా’ అంటూ 19-1-2010న వేణుగోపాల్‌రెడ్డి భౌతికకాయం పక్కనే కూర్చున్న విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్. అన్నట్టుగానే తన రాజకీయ చతురవ్యూహాలతో తెలంగాణ సాధించి చూపెట్టారు.