హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రైతు దేశానికి వెన్నెముక. ఆ వెన్నముకను విరవడమే పనిగా మోదీ సర్కార్ కంకణం కట్టుకున్నదని నవనిర్మాణ్ కృషక్ సంఘటన్ కన్వీనర్, ఒడిశా రైతు నేత అక్షయ్‌కుమార్ ఆరోపించారు. రైతులకు పాలకులు అండగా నిలబడాల్సింది పోయి, వారి జీవితాలను ఆగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని ఎత్తుకొని, రైతాంగానికి వెలుగురేఖగా నిలబడ్డారని చెప్పారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. దేశంలో గుణాత్మక మార్పులు కేసీఆర్ నాయకత్వంలో వస్తాయని ఘంటాపథంగా చెప్తున్న అక్షయ్‌కుమార్ నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..
రైతునేతగా దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను మీరెట్లా విశ్లేషిస్తారు?
నా జీవితంలో అనేక ప్రభుత్వాలను చూసిన. ప్రజాస్వామ్య వ్యవస్థలను అభాసుపాలు చేస్తూ, తమ ఇష్టారీతిగా పాలన సాగించిన ఇలాంటి రోజులను చూడలేదు. ఈ 8 ఏండ్లుగా దేశంలో ప్రజాస్వామ్యం స్థానంలో విచ్చలవిడి కార్పొరేట్స్వామ్యాన్ని చవిచూస్తున్నాం. ఇది దేశానికి మంచిది కాదు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు దొరకని దుస్థితి. దళారీ చేతిలో రైతు కీలుబొమ్మగా మారిండు. దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని రకాల సరుకులకు ఎంఆర్పీ ధర నిర్ణయించినట్టుగా రైతులకు ఎంఎస్పీ ఎందుకు దక్కదు?
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమే లేదంటారా?
దేశవ్యాప్తంగా రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్లు, పోరాటం చేస్తున్నవాళ్లు ఒక్కతాటిపైకి వస్తున్నారు. మా లాంటి వాళ్లందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆశాకిరణంగా కనిపించింది. దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగల వెలుగురేఖగా కేసీఆర్ కనిపించారు. దేశంలో 60 ఏండ్ల కిందట పంజాబ్‌లో ప్రతాప్‌సింగ్ అక్కడ ముఖ్యమంత్రిగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చారని విన్నాం. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ రైతు అనుకూల పాలనను కండ్లారా చూస్తున్నాం.
దేశానికి గుజరాత్ మాడల్ కావాలనే ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవమెంత?
ఇప్పుడిప్పుడే దేశప్రజలు తమ భ్రమలను తొలగించుకుంటున్నారు. గుజరాత్ మాడల్ అంటే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోకపోవడమా? నిరంతర కరెంట్ కోతలతో గుడ్డి గుజరాత్ (బ్లైండ్ గుజరాత్)గా ఉండటమా? వర్గ వైషమ్యాలతో నిత్యం కొట్టుకోవటమా? ఎందులో గుజరాత్ మాడల్ ఆచరించాలి? ఏ రకంగా చూసినా గుజరాత్ మాడల్ విఫలమైంది. దేశం తెలంగాణ మాడల్‌ను కోరుకుంటున్నది. కేవలం 8 ఏండ్ల కాలంలో తెలంగాణలో దాదాపు అన్ని రంగాల్లో గుణాత్మక మార్పులు వచ్చాయి.
వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెస్తున్నామని కేంద్రం చెప్తున్నది కదా? మీరేమంటారు?
తమకు అనుకూలమైన వారికి ప్రయోజనాలు కల్పించేందుకు పెట్టుకున్న అందమైన పేరు సంస్కరణ. దేశంలో రావాల్సింది రిఫార్మ్స్ కాదు రివల్యూషన్. బీజేపీ మ్యానిఫెస్టోలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, కానీ ఖర్చు నాలుగింతలు పెరిగింది. కరోనా సమయంలో మూడు సాగు చట్టాలు తెచ్చి రైతు చేతిలో ఉన్న భూమిని లాక్కోవటానికి ప్రయత్నించింది. ఆ పోరాటంలో 750 మంది ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ మాటలకు చేతలకు పొంతన ఉండదు. మోదీ రైతు విరోధిగా మారారు.
దేశంలో తమను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదని బీజేపీ చెప్తుతున్నది. ఇందులో నిజమెంత?
ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ కూడా ఇంతకంటే ఎక్కువగానే అనుకున్నారు. కానీ, ఏం జరిగింది? వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలను నిర్లక్ష్యం చేస్తూ, నిరుద్యోగితను పెంచుతూ, అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తూ ఆధిపత్యం, అప్రజాస్వామ్యమే విలువగా చేసుకొని విర్రవీగుతున్న బీజేపీ, మోదీకి నిజమైన ప్రత్యామ్నాయం ముమ్మాటికీ బీఆర్ఎస్, కేసీఆరే. ఇందులో అనుమానంలేదు.
తెలంగాణలో అమలవుతున్న రైతు విధానాలపై మీ కామెంట్?
దేశ రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు చేరినవారు, అత్యున్నత పదవులను చేపట్టిన వారిలో అత్యధికులు రైతుకుటుంబాల నుంచి వచ్చినవాళ్లే. కానీ, రైతు సమస్యను పట్టించుకున్న వాళ్లు చాలా తక్కువ. ఇన్నేండ్ల తర్వాత రైతు పాలకుడిగా కేసీఆర్ దేశానికి పరిచయమయ్యారు. దేశమే రాష్ట్రం వైపు తిరిగి చూసేలా తెలంగాణను తీర్చిదిద్దారు. 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన కరెంట్‌ను రైతుకు అందిస్తున్నారు. ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేల చొప్పున పంట పెట్టుబడి సహాయం చేస్తున్నారు. రైతు మరణిస్తే ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు రైతుబీమా సౌకర్యం,ప్రీమీయం కూడా ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేశారు. చిన్ననీటి వనరులకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే, కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టులను నిర్మించారు. తెలంగాణలో అమలు అవుతున్న రైతు అనుకూల విధానాలు ఇప్పుడు దేశమంతా అమలవ్వాలనే డిమాండ్ వస్తున్నది. అందుకే నా లాంటి రైతు ఉద్యమకారులు కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదానికి ఆకర్షితులమయ్యాం.
అక్షయ్ కుమార్ చెప్పిన ప్రతాప్‌సింగ్ ఎవరు?
ప్రతాప్‌సింగ్. స్వాతంత్య్రానంతరం దేశంలో వ్యవసాయ రంగానికి జీవం పోసిన నాయకుడు. 1956 నుంచి 1964 దాకా పంజాబ్ ముఖ్యమంత్రిగా, అంతకన్నా ముందు దేశ విభజన సమయంలో అత్యంత క్లిష్టమైన సమయంలో పంజాబ్ రాష్ట్ర పునరావాస శాఖను, అభివృద్ధి శాఖను నిర్వహించారు. పంజాబ్ హరిత విప్లవానికి నాంది పలికిన నాయకుడు. పంజాబ్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన పాలకుడు.