Dharani | ధరణితో కుదుటపడ్డ రైతుల జీవితాలు.. కాంగ్రెస్ వస్తే భూ సంస్కరణలకు సమాధి
పటేల్ పట్వారీ, రెవెన్యూ వ్యవస్థలో అక్రమాలు, అన్యాయాలకు రైతులు ఎలా బలయ్యేవారో చెప్పేందుకు పై రెండు ఉదాహరణలు చాలేమో. ధరణి వచ్చిన తర్వాతనే రైతుల జీవితాలు కుదుటపడ్డాయి. తమ భూములకొచ్చిన ఢోకాలేదని గుండెపై చేయివేసి హాయిగా నిద్రపోగలుగుతున్నారు.
- పంట భూములు పరాధీనం!
- ధరణిని తీసేసి వీఆర్వోలకు పెత్తనం ఇస్తరట
- కౌలుదారుల కాలమ్‌తో మళ్లీ వివాదాలు
- ఉమ్మడి రాష్ట్రంలో రికార్డులన్నీ ఆగమాగం
- ప్రతి ఎకరాకో చిక్కుముడి.. రైతుకో సమస్య
- అన్నదాతలకు అండగా సీఎం కేసీఆర్
- భూ రికార్డుల ప్రక్షాళనతో సంస్కరణలు
- ధరణితో అన్నదాతల చేతికి అధికారం
- మళ్లీ పాత రోజులు తెస్తామంటున్న కాంగ్రెస్
2016-18 మధ్య కాలంలో నల్లగొండ జిల్లా చందంపేటలో నకిలీ పాస్ పుస్తకాల కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్డీవో కార్యాలయంలో గుట్టలుగా పడి ఉన్న పాస్‌పుస్తకాలను చందంపేట ఎమ్మార్వో, మరికొందరు అధికారులు కలిసి మాయం చేశారు. లంచం ఇస్తే చాలు వారి ఫొటోలు, ఇష్టమొచ్చిన సర్వే నంబర్లతో నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు సిద్ధం చేశారు. ఆ రికార్డులను పహాణీల్లోకి కూడా ఎక్కించారు. ఇలా 13,959 ఎకరాల అటవీ భూములకు పట్టాలు ఇచ్చేశారు. భూరికార్డుల నిర్వహణ గ్రామ, మండలస్థాయి అధికారుల చేతుల్లో ఉంటే అవినీతి అనకొండలు ఎలా చెలరేగిపోతాయో చెప్పేందుకు ఇదో ఉదాహరణ.
పటేల్ పట్వారీ వ్యవస్థ పాతుకుపోయిన సమయంలో భూముల రికార్డులే కాదు, రైతుల తలరాతులు కూడా చిటికెలో మారిపోయేవి. అవి రద్దయ్యాక వచ్చిన రెవెన్యూ వ్యవస్థలో పహాణీ రికార్డులు వీఆర్వోల ఇండ్లలో ఉండేవి. వీరు రాసిందే రాత, గీసిందే గీతగా ఉండేది. తమకు కావాల్సినవారి పేర్లతో బై నంబర్లు వేసి కాగితంలోనే భూములను సృష్టించేవారు. దేవుడి భూములు కూడా స్వాహా అయ్యేవి. 2019 ఏప్రిల్ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లికి చెందిన 50 మంది రైతులు వీఆర్వోపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తమకు పాస్‌బుక్ కావాలంటే ఒక్కొక్కరు రూ. లక్ష ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మచ్చుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
Dharani | హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): పటేల్ పట్వారీ, రెవెన్యూ వ్యవస్థలో అక్రమాలు, అన్యాయాలకు రైతులు ఎలా బలయ్యేవారో చెప్పేందుకు పై రెండు ఉదాహరణలు చాలేమో. ధరణి వచ్చిన తర్వాతనే రైతుల జీవితాలు కుదుటపడ్డాయి. తమ భూములకొచ్చిన ఢోకాలేదని గుండెపై చేయివేసి హాయిగా నిద్రపోగలుగుతున్నారు. వారు అలా హాయిగా, సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేస్తామని భయపెడుతున్నది. రైతులను గోసపెట్టుకున్న వీఆర్వోలకే మళ్లీ పెత్తనం ఇస్తామని చెప్తున్నది. కౌలుదారుల కాలమ్‌తో మళ్లీ కొట్లాటలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నది. ప్రశాంతంగా ఉన్న రైతుల జీవితాల్లో నిప్పులు పోయాలని చూస్తున్నది. అయితే, వారి ఆటలు సాగనివ్వబోమని రైతులు తెగేసి చెప్తున్నారు.
ధరణితో హాయిగా ఉన్నదని, దీనిని తీసేస్తామంటున్న కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వబోమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేయిస్తే 99 శాతం భూములపై ఏదో ఒక వివాదం ఉన్నట్టు వెల్లడైంది. గతంలో దక్ష్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం సివిల్ కోర్టుల్లోని కేసుల్లో 66 శాతం భూ వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. కోర్టుల చుట్టూ తిరిగే కుటుంబాల్లో 75 శాతం మందికి నెలవారీ సంపాదన రూ.25 వేల లోపే ఉన్నదని స్పష్టం చేశాయి. దేశంలో జరుగుతున్న హత్యల్లో 14 శాతం భూ తగాదాల వల్లే జరుగుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. రికార్డులు సరిగా లేక రైతులు ఎకరానికి ఏటా రూ.50వేల వరకు కోల్పోతున్నారని పేర్కొన్నది. భూ తగాదాల వల్ల జాతీయ ఆదాయానికి 1.3 శాతం నష్టం కలుగుతున్నట్టు వివరించింది.
సంస్కరణల పథం.. భూమి భద్రం
- నేను కూడా కాపోన్నే.. నాకు కూడా పొలం ఉన్నది. వ్యవసాయం చేస్త. రైతు కష్టాలు నాకూ తెలుసు’.. సీఎం కేసీఆర్ తరుచూ చెప్పే మాట. రైతుల కష్టాలను కండ్లారా చూసిన కేసీఆర్ భూ సమస్యలకు శాశ్వత ముగింపు పలికేందుకు పలు సంస్కరణలు తీసుకొచ్చారు.
- 2017లో భూ రికార్డుల ప్రక్షాళణకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల రికార్డులను పరిశీలించి, నవీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.56 కోట్ల ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలించారు. 2.38 కోట్ల ఎకరాల పట్టాలు క్లియర్‌గా ఉన్నట్టు తేల్చారు. ఇందులో 1.42 కోట్ల ఎకరాలు వ్యవసాయ భూమిగా గుర్తించారు. రికార్డులన్నీ డిజిటలైజ్ చేశారు.
- కొత్త రికార్డుల ఆధారంగా కొత్త పాస్ పుస్తకాలను మంజూరు చేశారు. గతంలో పాస్ పుస్తకాల్లో ఉన్న కాలమ్లన్నింటినీ తొలిగించారు. హక్కుదారు కాలం మాత్రమే ఉంచారు. 2018 నుంచి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ మొదలుపెట్టారు.
- రెవెన్యూలో అవినీతికి వీఆర్వో వ్యవస్థే అసలు కారణమని గుర్తించారు. దానిని రద్దుచేస్తూ 2020 సెప్టెంబర్ 9న అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. దీంతోపాటు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు. 5,576 మంది వీఆర్వోలను ఇతర శాఖల్లోకి బదిలీ చేశారు.
- ఆధునీకరించిన భూమి రికార్డులతో ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్‌కు రూపకల్పన చేసింది. 2020 సెప్టెంబర్ 29న సీఎం కేసీఆర్ ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. వ్యవసాయ, వ్యవసాయేతర, ప్రభుత్వ భూముల వివరాలన్నింటినీ అందులో పొందుపరిచింది. భూ రికార్డుల నిర్వహణను అధికారుల చేతుల్లో నుంచి తీసేసింది. ధరణి పోర్టల్ ఆధారంగానే భూ లావాదేవీలు జరిగేలా పటిష్ట వ్యవస్థను రూపొందించింది. రైతు వచ్చి వేలిముద్ర వేస్తే తప్ప పట్టా మార్పిడి జరగని పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి భూ వివాదాలకు చెక్ పడింది.
- ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ అత్యంత సులభంగా, పారదర్శకంగా మారింది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ మొత్తం తహసీల్దార్ కార్యాలయంలోనే జరుగుతున్నది.
- ధరణితో అధికారుల విచక్షణాధికారాలకు కత్తెర పడింది. రికార్డులను వీఆర్వోలు, ఆర్ఐలు, తాసిల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు ఇష్టం వచ్చినట్టు మార్చే అవకాశం లేకుండా పోయింది. రైతు వచ్చి వేలిముద్ర వేసినప్పుడే హక్కులు మారిపోతాయి. రికార్డుల్లో ఏవైనా తప్పులు ఉంటే రైతు స్వయంగా దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ పరిశీలించి మార్పులు చేసేలా పోర్టల్ సదుపాయం కల్పించింది.
- వీఆర్ఏలు తరతరాలుగా వెట్టిచాకిరీకి ఆనవాళ్లుగా మిగిపోయారు. ఈ నేపథ్యంలో వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారిని ఇతర శాఖల్లో విలీనం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సుమారు 23వేల మందిని ప్రభుత్వ శాఖల్లోకి తీసుకొని, పేస్కేల్ అమలు చేస్తున్నారు.
- ధరణితో ప్రభుత్వం దగ్గర 65 లక్షల మంది రైతుల డాటా తయారుగా ఉన్నది. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు, పంట కొనుగోళ్లు వంటి ఇతర ప్రయోజనాలు నేరుగా రైతు ఖాతాల్లోనే పడుతున్నాయి.
- రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎంత మంది రై తులు ఉన్నారు? వారి ఆధీనంలో ఎంత భూమి ఉన్నది? అక్కడ ఏయే రకమైన పంటలు వేస్తారు? వంటి సమగ్ర వివరాల అధికారిక రికార్డు ప్రభుత్వం దగ్గర ఉన్నది. కాబట్టి విద్యుత్తు ఎంత అవసరం అవుతుం దో, దాని కోసం ఎంత ఖర్చు అవుతుందో కచ్చితంగా అంచనా వేయగలుగుతున్నది.
మొత్తంగా.. ఇప్పుడు రైతు విద్యావంతుడా, నిరక్ష్యరాస్యుడా అన్న సమస్య లేదు. లంచాలు ఇవ్వాలన్న రంది లేదు. ధరణితో తన వేలి కొసతో, కంటిచూపుతోనే తన భూమిని, తనకు ఇష్టం ఉన్నవారి పేరుమీదికి మార్చే శక్తి వచ్చింది. దళారుల దందాలు బంద్ అయ్యాయి. అధికారులు, నేతల బెదిరింపులకు చరమగీతం పాడింది. పైగా రాష్ట్రంలో రైతులు ఎంతమంది? ఎంత విస్తీర్ణం? ఏయే పంటలు వేస్తున్నారు? వంటి వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర పక్కాగా ఉన్నాయి. దీంతో ఏయే ఎరువులు, ఎంత మేర స్టాక్ పెట్టుకోవాలో అంచనా వేస్తున్నారు. ముందస్తుగానే స్టాక్‌ను పెడుతున్నది. ఫలితంగా లైన్లల్లో నిలబడే గోస, చెప్పులు, పాస్ బుక్కులు లైన్లలో పెట్టే దుస్థితి తప్పింది.
మళ్లా పైరవీకారులను తెస్తారట
ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో పడేస్తామని కాంగ్రెస్ పదేపదే చెప్తున్నది. పాస్ పుస్తకాల్లో పాత పద్ధతిలోనే 36 కాలమ్‌లు పొందు పరుస్తామని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖరాఖండిగా చెప్తున్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో బాజాప్తా వీఆర్వో పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించింది. అంటే మళ్లీ వీఆర్వోలను నియమించి, గ్రామస్థాయిలోనే రైతుల భూములను ఇష్టం వచ్చినట్టు మార్చే పాత, రాత పద్ధతిని తీసుకొస్తామని చెప్పింది. రైతుబంధు అందుకుంటున్నవారిలో 90 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులు 58 లక్షల మంది వరకు ఉన్నారు. అంటే మొత్తం రైతుల్లో 92 శాతం మంది. ధరణి పోర్టల్ ఎత్తివేసినా, రైతుబంధు ఆగిపోయినా వందకు 92 మంది రైతుల బతుకులు చీకట్లో మగ్గిపోతాయన్నమాట. రైతులు మళ్లీ ఎరువుల కోసం లైన్లలో నిలబడాల్సి వస్తుంది. 24 గంటల కరెంట్ స్థానంలో వాళ్లు చెప్తున్న మూడు గంటల కరంటే వస్తుంది. చివరికి.. రైతు బతుకు ఆగమవుతుంది.
పైసలిస్తేనే పట్టా
ఒకప్పుడు భూమి హక్కుల మార్పిడి అంటే కైలాసం ఆడినట్టే ఉండేది. ఒక నిచ్చెన ఎక్కామని సంతోషపడే లోపే పాము మింగేసేది. ఒక వ్యక్తి వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి, దానికి పాస్‌బుక్ పొందాలంటే సవాలక్ష అడ్డంకులు ఉండేవి. డాక్యుమెంట్ రైటర్ నుంచి ప్రతి ఒక్కరి చేతులు తడపాల్సి వచ్చేది. అడిగినంత ముట్టజెప్తే తప్ప పని పూర్తయ్యేది కాదు. కొన్ని సందర్భాల్లో మాన్యువల్‌గా 1బీ, పహాణీల్లో పేర్లు మార్చి పాస్‌బుక్ ఇచ్చేవారు. చేతిలో పాస్‌బుక్ ఉన్నా ఆన్లైన్లో మాత్రం పాత యజమానుల పేర్లే కనిపించడంతో ఒకే భూమిపై డబుల్ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగేవి. ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం పెండింగ్ మ్యుటేషన్లకు అవకాశం కల్పించింది. 1,79,470 పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులు పరిష్కరించింది. అంటే, గతంలో ఉన్న దోపిడీ విధానాలు, అసంబద్ధ చర్యల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 1.79 లక్షల మంది మ్యుటేషన్ చేయించుకోలేకపోయారన్నమాట.
పట్వారీ వ్యవస్థ వస్తే కష్టాలు కొనితెచ్చుకునుడే
గతంలో పట్వారీ వ్యవస్థతో రైతులందరూ ఎన్నోపాట్లు పడ్డారు. కౌలుదారు, పట్టాదారు కాలమ్ పెట్టి మరీ భూములున్న రైతులను నట్టేట ముంచారు. కాంగ్రెసోళ్లు అధికారం కోసం ధరణి తీసి భూమాత పెట్టి మా రైతులను బొందపెడుతారా? ఇలాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలు చేసి రాష్ట్ర రైతాంగాన్ని ఆగంజేస్తరేంది. ధరణి పోర్టల్ వల్ల పైరవీలు లేకుండా పోయినవి. ఇప్పుడు సిస్టం బాగున్నది.
-నంద్యాల విష్ణువర్ధన్‌రెడ్డి, రైతు, గుమ్మడిదల మండలం (సంగారెడ్డి జిల్లా)
ధరణి లేకపోతే రైతులు ఆగమవుతారు
నారాయణరావుపేట, నవంబర్ 18: తెలంగాణ రాక ముందు ఉన్న పట్వారీ వ్యవస్థ వల్ల మస్తు గోస పడ్డాం. అప్పుడు పహాణీ కావాలంటే పట్వారీ దగ్గరికి వెళ్తే ఎంతో కొంత పైసలు ఇవ్వాల్సి వచ్చేది.పట్వారీలు ఉన్నప్పుడు పంట నష్టం రాయాలన్నా, బ్యాంక్ లోన్‌కు భూమి రికార్డులు కావాలన్నా ఎంతో కొంత ఖర్చు ఆయ్యేది. అధికారుల సుట్టు తిరిగేది. భూమి కొని పట్టా చేసుకున్న తర్వాత దానిని రికార్డుల్లోకి ఎక్కించి మ్యుటేషన్ చేయించాలన్నా. పట్టా పాసుబుక్ కావాలన్నా తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ఇబ్బంది పడేది. తెలంగాణ వచ్చినంకా కేసీఆర్ సార్ ధరణితో ఒక్క దగ్గరనే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ చేసి సాయంత్రం వరకు పాసు బుక్ ఇస్తున్నారు.ఇప్పుడు మా భూమిపై మాకు పూర్తి అధికారం వచ్చింది. ధరణి తెచ్చి మాకు రైతుబంధు ఇస్తున్నరు. కాంగ్రెసోళ్లు ధరణి లేదు ఏమీ లేదు అంటున్నారు. ధరణి లేకపోతే రైతులు ఆగమవుతారు
– పాతర్ల అంజయ్య, రైతు, గుర్రాలగుంది (సిద్దిపేట జిల్లా)
అప్పట్ల అరిగోస పడ్డం
కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు పటేల్ పట్వారీలతో అరిగోస పడ్డం. ఆర్వోఆర్ పేరుతో భూములు పట్టా చేసేందుకు పైసలిచ్చేటోళ్లం. డబ్బులిస్తే ఒకరి పేరుతో ఉన్న భూమిని మరొకరి పేరుతో మార్చి పట్వారీలు గోసపెట్టుకున్నరు. తెలంగాణ వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి తీసుకువచ్చి భూములకు భద్రత కల్పించిండు. పట్టాదారు అనుమతి లేనిదే భూమి మార్పిడి చేసే అధికారం లేకుండా చేసిండు. మళ్లా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పటేల్ పట్వారీల వ్యవస్థ తీసుకువస్తామని చెప్పడం సరైంది కాదు. కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడ్డరు.
– బైకన అయిలుకొంరు, రైతు, ఉప్పల్, కమలాపూర్(హనుమకొండ)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

