CM KCR Public Meeting | నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట ప్రగతి నివేదన సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో భానుపురి జనసంద్రంగా మారింది. ఎటుచూసినా సందడే సందడి నెలకొన్నది. అపర భగీరథుడు, మహానేత కేసీఆర్‌ను చూసేందుకు ఉదయం నుంచే జనం ఆతృతగా ఎదురుచూశారు. సూర్యాపేట నియోజకవర్గంతోపాటు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సూర్యాపేటకు వచ్చే అన్ని దారులు గులాబీమయమయ్యాయి. సభకు వచ్చే వాహనాలతో రహదారులన్నీ నిండిపోయాయి. సీఎం కేసీఆర్ సభా వేదిక మీదికి రాగానే ఒక్కసారిగా ‘జై కేసీఆర్’ అంటూ ఈలలు, చప్పట్లు, నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది.
సీఎం ప్రసంగానికి జనం జేజేలు
సూర్యాపేట ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం చలోక్తులు, విపక్షాలపై పంచులు, ప్రశ్నలతో సాగింది. దీంతో సభకు వచ్చిన వారి నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించే సమయంతోపాటు విపక్షాలపై విమర్శలు చేసినప్పుడు చప్పట్లు, ఈలలు మార్మోగాయి. ఇక స్థానిక అంశాలు, నేతల గురించి ప్రస్తావించిన ప్రతిసారి జనం పెద్ద పెట్టున కేరింతలు కొట్టారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధుల కేటాయింపు ప్రకటనపై హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ‘కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఒక్క అవకాశం ఇవ్వాలంటున్నారు’ అని సీఎం అనడంతోనే వద్దు..వద్దు..అని సభికుల నుంచి ప్రతిస్పందన వ్యక్తమైంది. కేసీఆర్ కంటే రెండింతల పొడుగు, దొడ్డున్నోళ్లు ఇన్నాళ్లు ఏమి చేశారని ప్రశ్నించినప్పుడు కూడా సభ ఈలలు, కేరింతలో దద్దరిల్లింది. కులం లేదు, జాతి లేదు, మతం లేదు అంద ర్నీ కాపాడుకుంటూ పోతున్నామంటున్నామని కేసీఆర్ చెప్పినప్పుడు అవును.. అవును.. అని అరుపులు వినిపించాయి. ఇక్క డ కాంగ్రెసోళ్లు చెప్తున్న పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇస్తున్నారా? అంటే లేదు.. లేదు.. అని ప్రజలు స్పందించారు. త్వరలోనే మనం కూడా తప్పకుండా పెన్షన్ పెంచుకుందామని కేసీఆర్ అనగానే..చప్పట్లు మార్మోగాయి.

‘ధరణి’కి భారీ స్పందన..
సీఎం కేసీఆర్ ధరణి గురించి ప్రస్తావించిన ప్రతిసారి ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. ధరణిలో ఒక్కసారి భూమి ఎక్కిందంటే మార్చే మొనగాడు ఉన్నాడా? అని కేసీఆర్ ప్రశ్నించగా.. లేడు.. లేడు.. అంటూ ప్రజలు స్పందించారు. రైతు భూమిని మార్చాలంటే ఎవ్వరికీ పవర్ లేదు… మీ బొటన వేలుకే ఉన్నదని కేసీఆర్ అన్నప్పుడు పెద్ద ఎత్తున చప్పట్లు మార్మోగాయి. ధరణితోనే రైతు బంధు డబ్బులు పడుతున్నాయని, టింగ్టింగ్ మంటూ సెల్ఫోన్లు మోగుతున్నాయని సీఎం అనగానే ఈలలు వినిపించాయి. చివర్లో ధరణి ఉండాలా? తీసేయాలా? అని సీఎం కేసీఆర్ సభికులను ప్రశ్నించగా.. ‘ఉండాలి.. ఉండాలి’ అంటూ జనం స్పందించారు. ఉండాలనే వాళ్లు చేతులు ఎత్తాలని సీఎం అనగానే సభా ప్రాంగణంలోని ప్రజలంతా చేతులు ఎత్తి తమ సమ్మతి ప్రకటించారు. రుణమాఫీ గురించి ప్రస్తావించిన సమయంలోనూ సభ నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. కాళేశ్వరం జలాల గురించి చెబుతూ ఎక్కడి గోదావరి.. ఎక్కడి రావిచెరువు.. 450 కిలోమీటర్ల దూరంలోని రావి చెరువు నిండుతున్నదంటే మామూలు విషయమా? అని కేసీఆర్ అంటే రైతులంతా పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి స్వాగతించారు. ఇలా సీఎం ప్రసంగం ఆద్యంత ఉత్సాహభరింతంగా ప్రజలు అందులో లీనమయ్యేలా సాగిపోవడం విశేషం.
పాదయాత్రగా సూర్యాపేట జనం
సూర్యాపేటను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన తమ అభిమాన నేత సీఎం కేసీఆర్ పట్ల జనం ప్రత్యేక అభిమానాన్ని చాటారు. మంత్రి జగదీశ్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు పట్టణంలోని అన్ని వార్డుల నుంచి మెజార్టీ ప్రజలు పాదయాత్రగా సభా స్థలికి చేరుకోవడం విశేషం. మహిళలు బోనాలు, బతుకమ్మలతో, డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలతో తరలివచ్చారు. సూర్యాపేట నియోజకవర్గంతోపాటు తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి వచ్చిన వారంతా తమకు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను నిలిపి నలువైపులా సభాస్థలికి బారులు కట్టారు. మధ్యాహ్నం నుంచే మానుకోట ప్రసాద్, ఇతర కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులను అలరించారు. సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకొని సాయంత్రం 5:12 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకొన్నారు.
సీఎం కాన్వాయ్ కలెక్టరేట్ నుంచి సూర్యాపేట పట్టణం మీదుగా సభాస్థలికి వచ్చే సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. సభ సక్సెస్ కావడంతో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు మిగతా ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సభలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగత్‌కుమార్, పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్లు గుజ్జ దీపికాయుగంధర్‌రావు, బండ నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జగదీశ్‌రెడ్డి గింత హుషారు అనుకోలేదు: సీఎం కేసీఆర్
‘మీ మంత్రి జగదీశ్‌రెడ్డి గింత హుషారు అనుకోలేదు’ అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడంతో చప్పట్లు మార్మోగాయి. సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ సూర్యాపేట గురించి ప్రస్తావించారు. ‘మంత్రి గారు కొన్ని కోరికలు ముందు పెట్టిండు. కోరికలు ముందు పెట్టినప్పుడు జగదీశ్‌రెడ్డి గింత హుషారు అని నేను అనుకోలేదు. మాకు అన్ని ఇచ్చారు.. సూర్యాపేట జిల్లానే ఇచ్చారు.. మాకు అన్ని అయిపోతాయి.. మీరు సభకు మీరు వచ్చిపోతే చాలు.. ఏమి అడుగ అని అకడ చెప్పిండు.. మొన్న మంత్రివర్గ సమావేశం జరుగుతుంటే మనం ఇచ్చిన మాట ఏనాడు కూడా తప్పలేదు. కచ్చితంగా రుణమాఫీ చేయాలని వాదించిన మంత్రులలో అగ్రగణ్యులు మన జగదీశ్‌రెడ్డి. జగదీశ్‌రెడ్డి కథ ఎట్లా ఉంది అంటే.. ఇంటికి వచ్చిన చుట్టం పోతా ఉంటే చలి అన్నం ఉంది తింటావా అంటే చలి అన్నం తింటా.. ఉడకన్నం అయ్యేదాక ఉంటా అని అన్నాడట.’ అంటూ జగదీశ్‌రెడ్డి తపన గురించి సీఎం కేసీఆర్ చెప్పకనే చెప్పారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ గురించి కూడా ప్రస్తావిస్తూ యువ నాయకుడు… ఆది నుంచి ఉద్యమంలో పాల్గొన్న వాడని పేర్కొన్నారు. కోదాడ, హుజూర్నగర్ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య, సైదిరెడ్డి మంచిగా పనిచేసే వారు ఉన్నారంటూ కేసీఆర్ అనడంతో పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. సూర్యాపేట జిల్లాపై సీఎం వరాల జల్లు కురిపించడంతో సభ చప్పట్లతో దద్దరిల్లిపోయింది.
సీఎం సూర్యాపేట పర్యటన సాగిందిలా..
కేసీఆర్ పంచ్..