కొత్తగూడెం: సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తనదైన స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘భద్రాద్రి సీతారామ చంద్రస్వామి కొలువుదీరిన ఈ పావన భూమికి నేను శిరసు వంచి నమస్కరింస్తున్నా. ఆ స్వామి పేరునే ఈ జిల్లాకు పెట్టుకున్నాం. నేనో నాలుగు విషయాలు చెప్పదల్చుకున్నా. శ్రద్ధగా వినండి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యింది. అయినా దేశంలో రావాల్సినంత రాజకీయ పరిణతి రాలేదు. ఎన్నికలొస్తే అబద్ధాలు చెప్పడం, బూతులు తిట్టుకోవడం, మోసపూరిత వాగ్ధానాలు. ఇదీ మన దేశంలో జరుగుతున్న తంతు’ అన్నారు.
‘ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంది. ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక్క వజ్రాయుధం లాంటి ఆయుధం ఓటు. ఆ ఓటు ఆగమాగం వేస్తే మన తలరాత కింద మీదైతది. ప్రజలు కోరుకున్న వాళ్లు గెలిచినప్పుడే అది ప్రజల గెలుపు అయితది. కాబట్టి బాగా ఆలోచించి ఓటేయాలి. మూడు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీల ఉంటరు. ఆ ముగ్గురిలో ఎవరు మంచి వ్యక్తో చూడాలి. పార్టీల వైఖరి, ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను బేరీజు వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ అలా ఆలోచించి ఓటేస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతది’ అని సీఎం సూచించారు.
‘సింగరేణి కథ మీకు తెలియాలి. 134 సంవత్సరాల చరిత్ర ఉన్నది మన సింగరేణికి. తెలంగాణ కొంగు బంగారం మన సింగరేణి గనులు. ఈ సింగరేణి వందకు వందశాతం మనకే ఉండే. ఇది తెలంగాణ ఆస్తి. తెలంగాణ సొత్తు. చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి.. 30-40 ఏళ్లు అప్పులు తిరిగి చెల్లించలేదు. యువకులు సింగరేణి చరిత్ర తెలుసుకోవాలి. వందశాతం తెలంగాణ ఆస్తిగా ఉన్న సింగరేణిలోంచి సమైక్య రాష్ట్రంలో చేతగాని కాంగ్రెస్ పాలకులు అప్పులు తిరిగి చెల్లించకపోవడంవల్ల కేంద్రానికి 49 శాతం వాటా వెళ్లింది. లేకపోతే వందకు వందశాతం మన గనులు, మన ఆస్తి. ఎప్పుడో నిజాం రాజు కాలంలో ప్రారంభమైన గనిలో 49 శాతం వాటా కేంద్రానికి వదులుకోవాల్సి వచ్చింది’ అని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.
‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే సింగరేణి నడకను మార్చినం. మొదటి అడుగులోనే 3 శాతం తెలంగాణ స్టేట్ ఇంక్రిమెంట్ ఇచ్చినం. కంపెనీ టర్నోవర్ కాంగ్రెస్ రాజ్యంలో రూ.11 వేల కోట్లు ఉండేది. దాన్ని ఈ రోజు రూ.33 వేల కోట్లకు తీసుకుపోయినం. సింగరేణి లాభాలు రూ.419 కోట్లు ఉండేది. దాన్ని రూ.2,184 కోట్లకు తీసుకుపోయినం. గతంలో కార్మికులకు పంచే లాభం ఏటా 60, 70 కోట్లు ఉండేది. కానీ ఈ దసరాకు మనం పంచిన లాభం రూ.700 కోట్లు. నూతన నియామకాల వల్ల సింగరేణి యువ కార్మికులతో కళకళలాడుతున్నది’ అని సీఎం చెప్పారు.
‘తెలంగాణ రాకముందు 6400 ఉద్యోగాలు వస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర ఏళ్లలో 19,463 మంది ఉద్యోగాలిచ్చినం. డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టిందే కాంగ్రెస్ యూనియన్. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినంకనే డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాం. దాని ద్వారా 15,256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలిచ్చాం. గతంలో కార్మికులు చనిపోతే ఒక లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేవాళ్లు . ఇప్పుడు రూ.10 లక్షలు ఇస్తున్నం. డిపెండెంట్ ఉద్యోగం తీసుకోకపోతే రూ.25 లక్షలు ఇస్తున్నం. కార్మికులు తీసుకునే ఇంటి రుణానికి వడ్డీ మొత్తం సింగరేణి చెల్లిస్తున్నది. రూ.10 లక్షలు వడ్డీలేని రుణాలు ఇస్తున్నది. సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న 22 వేల మందికి జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగింది’ అని ముఖ్యమంత్రి తెలిపారు.