మంచిర్యాల, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. కాగజ్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ అభ్యర్థి కోవ లక్ష్మి, బెల్లంపల్లి అభ్యర్థి దుర్గం చిన్నయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఈ సభలకు జనం నీరాజనం పలికారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు వేలాది మంది తరలివచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా కాగజ్‌నగర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ స్థానిక ఎస్పీఎం గ్రౌండ్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. వేలాది మంది జనం రావడంతో ప్రాంగణం సరిపోక దాదాపు 20 వేల మంది రోడ్ల మీద నిలబడాల్సి వచ్చింది.
ఆసిఫాబాద్‌లోని ప్రేమలా గార్డెన్ పక్కన నిర్వహించిన సభకు దాదాపు 40 వేల మందికిపైగా హాజరయ్యారు. మహారాష్ట్రలోని రాజురా నుంచీ ప్రజలు సీఎం కేసీఆర్‌ను చూసేందుకు తరలివచ్చారు. బెల్లంపల్లి సభకు నియోజకవర్గ ప్రజానీకం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. స్థానిక తిలక్ స్టేడియం మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. సుమారు 50 వేల పైచిలుకు మంది హాజరయ్యారు. ప్రాంగణంలో స్థలం సరిపోక ప్రహరీ అవతల నిలబడి, చుట్టు పక్కల ఉన్న భవనాలపై నుంచి సభను తిలకించారు. కళాకారులు మిట్టపల్లి సురేందర్, ఏపూరి సోమన్న, సింగర్ మధుప్రియ ఆటపాటలతో హోరెత్తించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం సాగుతున్నంతసేపు సభలకు వచ్చిన ప్రజలు శ్రద్ధగా విన్నారు.
సభలో కేసీఆర్ మార్క్ పంచ్‌లు ‘తీర్థం పోదం తిమ్మక్క అంటే వాడు గుల్లే.. వీడు సల్లే.. మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే, మళ్లొచ్చే సరికి ఇండ్లు కాలినట్లు’.. అనగానే సభల్లోని జనమంతా కేరింతలు, చప్పట్లు కొట్టారు. సభ వేదికలపైకి సీఎం వచ్చి అభివాదం చేస్తుంటే జై కేసీఆర్, జైజై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు. రైతుబంధు ఉండాల్నా? 24 గంటల కరెంట్ కావాల్నా? ధరణి ఉండాల్నా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించినప్పుడు.. ఉండాలంటూ సభలకు వచ్చిన జనం నుంచి సమాధానాలు వచ్చాయి. కాగజ్‌నగర్‌లో, బెల్లంపల్లిలో సభా వేదిక వరకు హెలిక్యాప్టర్ రావడంతో సీఎం కేసీఆర్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు.