హైదరాబాద్ : స్వాతంత్ర్యానికి పూర్వమే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
ఆసేతు హిమాచలం అన్ని వర్గాల ప్రజల్లో దేశం పట్ల విశ్వాసాన్ని నెలకొల్పడానికి నాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్ల నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు భూమికగా, జవహర్ లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం, మతాలకు అతీతంగా దేశభక్తి భావనను పాదుకొల్పిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నేతలు చేసిన అవిరళ కృషి వల్ల ఒక్కొక్క చిక్కు ముడి వీడిపోయింది. భారతదేశం ఏకీకృతమైందని కేసీఆర్ పేర్కొన్నారు. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1956 వరకు సొంత రాష్ట్రంగా వెలుగొందింది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రం కొనసాగింది. మిగులు నిధులతో కూడిన నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని, అడుగులు వేయటం ప్రారంభించిందని కేసీఆర్ గుర్తు చేశారు.
1956లో దేశంలో జరిగిన రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా.. తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ-ఆంధ్రలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుండి తెలంగాణ ప్రజలలో తాము మోసపోయినామనీ, తాము దోపిడీకి గురువుతున్నామనే ఆందోళన గూడు కట్టుకుంది. ఇరుప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదు. సఖ్యత ఏర్పడలేదు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది. సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్రప్రభుత్వం అందుకు భిన్నంగా సాచివేత ధోరణిని అవలంభించింది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గాలికొదిలేసింది. తెలంగాణ ప్రజలు భయపడినట్లుగానే సమైక్య రాష్ట్రంలో అన్నిరంగాల్లో దారుణమైన వివక్ష అమలైంది. ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు.
2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నేనే స్వయంగా సారథ్యం వహించి, ఉద్యమ శంఖం పూరించాను. తెలంగాణ ప్రజలందరినీ ఒక్కటిచేసి, పద్నాలుగేళ్లు అవిశ్రాంత పోరాటాన్ని నడిపించాను. లక్ష్య సాధన కోసం మరణం అంచులదాకా వెళ్లేందుకు సిద్ధపడ్డాను. తెలంగాణ ఉద్యమం అంతకంతకూ తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దిగివచ్చింది. ప్రజా ఉద్యమం ఆశించిన గమ్యాన్ని ముద్దాడింది. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. తెలంగాణ ఏవిధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో, సంభావించారో.. అదేవిధంగా నేడు తెలంగాణ అన్నిరంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమించి.. దేశానికే దారిచూపే టార్చ్ బేరర్ గా నిలిచింది. విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలలో అనతికాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించి దేశానికే దిశానిర్దేశనం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన ప్రగతిశీల, పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగిందని కేసీఆర్ తెలిపారు.
2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డీపీ 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా, 2021-22 నాటికి 11 లక్షల 54 వేల 860 కోట్ల రూపాయలకు పెరిగింది. తలసరి ఆదాయం పెరుగుదలలోనూ తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును అధిగమించింది. 2014 -15 లో రాష్ట్ర తలసరి ఆదాయం 1 లక్షా 24 వేల 104 రూపాయలు కాగా, 2021-22 నాటికి 2 లక్షల 78 వేల 833 రూపాయలకు పెరిగింది. జాతీయ సగటు కన్నా మన రాష్ట్ర తలసరి ఆదాయం 86 శాతం అధికం కావడం మనందరికీ గర్వకారణం. సంపదను పెంచాలి.. పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. అనేకరకాల సంక్షేమ పథకాల ద్వారా ఏటా 50 వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తున్నది. పేద, బలహీన వర్గాల ప్రజలకు జీవన భద్రతను కల్పిస్తున్నదని కేసీఆర్ తెలిపారు.