వరంగల్/నల్లగొండ/కరీంనగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సూర్యాపేట: సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నలుదిక్కులు పిక్కటిల్లేలా నల్లగొండలో నగారా మోగింది. నకిరేకల్ శివాలెత్తి నాట్యమాడింది. స్టేషన్‌ఘన్‌పూర్ గర్జించింది. మానకొండూరు నియోజకవర్గం మురిసింది. సోమవారం ఆయాచోట్ల సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రజాఆశీర్వాద సభలు జనజాతరను తలపించాయి. గులాబీ జెండా రెపరెపలతో, హోరెత్తిన నినాదాలతో ఊరూరా జనం, బీఆర్ఎస్ శ్రేణులు చీమలదండుల వోలే బారులు తీరి సభలకు తండోపతండాలుగా తరలివచ్చారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కడియం శ్రీహరి, రసమయి బాలకిషన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలు పోటెత్తిన జనంతో విజయవంతమయ్యాయి. నల్లగొండకు లక్ష మందికి పైగా ప్రజలు తరలిరావడంతో పట్టణం జనసంద్రంగా మారింది. నకిరేకల్‌లోని మూసీ రోడ్డులో పంట పొలాల మధ్య 100 ఎకరాల్లో ఏర్పాటుచేసిన సభాప్రాంగణంలో జనం శివాలెత్తి నాట్యమాడారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌ను, ఆ పార్టీ నాయకులను విమర్శించినా, కొత్త హామీలను చెప్పినా, ఎమ్మెల్యే లింగయ్య పేరును ఉచ్ఛరించినా జనం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. లింగయ్య గెలుపును బ్రహ్మదేవుడు దిగివచ్చినా ఆపలేడని అనడంతో జనం కేరింతలు కొట్టారు.
మందిమాటలతో మారు మనుంబోతే..
సీఎం కేసీఆర్ నకిరేకల్ సభలో సామెతలు, చలోక్తులతో రక్తికట్టించారు. ‘మందిమాటలు పట్టుకొని మారు మనుంబోతే మళ్లొస్తాలికే ఇల్లు కాలిపోయింది’ అన్న సామెతను గుర్తు చేయగా సభలో నవ్వులు వెల్లివిరిశాయి. నకిరేకల్, నల్లగొండను ఈ పదేండ్లల్లో అద్భుతంగా తీర్చిదిద్దుతున్న అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ పట్ల అభిమానాన్ని చాటేందుకు పోటీ పడిన ఆయా నియోజకవర్గాల ప్రజలు తండోపతండాలుగా తరలిరావడం విశేషం. కళాకారులు మధుప్రియ, మానుకోట ప్రసాద్, సందీప్ బృందాల ఆటాపాటలు సభికులను ఉర్రూతలూగించాయి.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో వరంగల్-హైదరాబాద్ జాతీ య రహదారి జనంతో నిండిపోయింది. దానిపక్క న సభా ప్రాంగణానికి ఊహించిన దానికంటే ఎక్కువ మంది తరలివచ్చారు. కళాకారుల పాటలకు గులాబీ కండువాలను ఊపుతూ జనం నృ త్యాలతో కోరస్ కలిపారు. కరెంట్, ధరణి గురించి సీఎం కేసీఆర్ వివరించినప్పుడు జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన కానవచ్చింది.
మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభకు మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల నుంచి తండోపతండాలుగా వచ్చి విజయవంతం చేశారు. తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్ నుంచి సభాస్థలి వరకు రెండు కిలోమీటర్ల పొడవునా జనం బారులుదీరి కనిపించారు. బాలకిషన్‌ను 80 వేల మెజార్టీతో గెలిపించాలన్న కేసీఆర్ మాటకు సభికులంతా చేతుల పైకెత్తి జైకొట్టడంతో రసమయి బాలకిషన్ ఇగ గెలిచినట్టేనని చెప్పారు. సీఎం మాటలకు కరతాళ ధ్వనులతో జైకొట్టారు. కాంగ్రెస్, బీజేపీ తీరుపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.