కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హైస్పీడ్‌తో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్ గురువారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. కామారెడ్డితో తనకు పుట్టుక నుంచే అనుబంధం ఉందని చెప్పారు. తన తల్లి పుట్టింది కామారెడ్డిలోనేనని, చిన్ననాడు తాను ఇక్కడే పెరిగానని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కామారెడ్డితో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నదని తెలిపారు. కామారెడ్డి గురించి సీఎం కేసీఆర్ ఇంకా పలు విషయాలు చెప్పారు.
‘కామారెడ్డిలో తనకు దీవెన ఇవ్వడానికి వచ్చిన అశేష జనవాహినికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కామారెడ్డి గడ్డతోని నాకు పుట్టుక నుంచే సంబంధం ఉన్నది. బీవీ పేట మండలం కోనాపూర్ గ్రామాన్ని గతంలో పోసానిపేటగా పిలిచేది. మా అమ్మ పుట్టింది ఆ ఊర్లోనే. ఆరుగొండలో మా మేనమామలు ఉండేది. చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మతోటి వచ్చినప్పుడు రైలు కట్ట పక్కన బాదల్ సింగ్ అనే మార్వాడి ఇంట్ల ఉండేది. అడ్తిలో ఆరుగొండకు చెందిన నిమ్మల జివ్వారెడ్డి గారి అడ్తి చాలా ఫేమస్ అడ్తి. మేం అక్కడ కూడా ఉండేది’ అని సీఎం గుర్తు చేసుకున్నారు.
‘కామారెడ్డితో అంతకు మించిన అనుబంధం ఏందంటే.. మన నీళ్లలో ఎంత దోపిడీ జరిగిందో ప్రజలకు తెలయజేయడానికి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత 45 రోజులపాటు జలసాధన ఉద్యమాన్ని చేసినం. అప్పుడు పార్టీ నుంచి మండలానికో బ్రిగేడియర్‌ను వేసినం. నా అదృష్టం కొద్ది కామారెడ్డి మండల బ్రిగేడియర్‌గా నేనే ఇక్కడికి వచ్చి పనిచేసిన. గులాబీ కూలీ చేసి పరేడ్ గ్రౌండ్ సభకు పోవాలని నాడు పార్టీ పిలుపునిస్తే ఎక్కడి వాళ్లు అక్కడ కూలీ పనిచేసి నిధులు రాబట్టిండ్రు. నేను కూడా ఇక్కడి దేశాయ్ బీడీ ఫ్యాక్టరీలో కూలీ పనిచేసిన’ అని సీఎం చెప్పారు.
‘తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో కామారెడ్డి న్యాయవాదులు అందరికంటే ఎక్కువ చైతన్యం చూపించారు. ఇక్కడ న్యాయవాదిగా ఉన్న మా బావగారు రామారావుగారు, మిత్రుడు తిరుమల్రెడ్డిగారి నాయకత్వంలో కామారెడ్డి బార్ అసోషియేషన్ తెలంగాణ కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇలా తీర్మానం చేసిన తొలి బార్ అసోషియేషన్ కామారెడ్డి బార్ అసోషియేషన్. అది ఉద్యమానికి చాలా ఊపునిచ్చింది. అనంతరం కామారెడ్డిలో ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి, యావత్ తెలంగాణ ఉప్పెనలా తయారై తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నం’ అన్నారు.